
దేశంలో కరోనా వ్యాప్తి నిలకడగానే ఉంది. నిన్న 16 వేలకు చేరిన (corona cases in india) కేసులు.. శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు.. క్రియాశీల కేసులు, రికవరీల మీద ప్రభావం చూపుతున్నాయి. గురువారం 12,84,552 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,348 మందికి పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ముందురోజు కంటే 11 శాతం మేర కేసుల్లో తగ్గుదల కనిపించింది. నిన్న 13,198 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి దేశంలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3.42 కోట్లకు చేరగా.. అందులో 3.36 కోట్ల మందికి వైరస్ నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 1,61,334కి చేరింది. ఆ రేటు 0.47 శాతంగా ఉంది. గత ఏడాది మార్చి నుంచి ఇదే అత్యల్పం. నిన్న రికవరీ రేటు కాస్త తగ్గి..98.19 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వారపు సగటు పాజిటివిటీ రేటు 1.18 శాతానికి చేరింది. అలాగే రోజువారీ సగటు పాజిటివిటీ రేటు గత 25 రోజులుగా రెండు శాతం(1.12 శాతం)లోపే నమోదవుతోందని తెలిపింది. అయితే కేరళ ప్రభుత్వం (kerala govt) కరోనా మృతుల సంఖ్యను సవరిస్తోంది. గతంలో నమోదైన మరణాల్ని కొత్తగా చేరుస్తోంది. దాంతో కేంద్రం వెల్లడించే గణాంకాల్లో రోజువారీ మరణాలు (corona deaths in india) భారీగా కనిపిస్తున్నాయి. తాజాగా ఆ సంఖ్య 805గా ఉంది. వీటిలో 708 కేరళ నుంచి వచ్చినవే. వీటితో కేరళలలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 30 వేలకు చేరుకుంది. మరోవైపు నిన్న 74,33,392 మంది టీకా వేయించుకున్నారు. వీటితో కలిపి భారత్‌లో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 104.82 కోట్లకు చేరుకుంది.
ALso Read:కర్ణాటకలో కరోనా కలకలం: గురుకుల పాఠశాలలో 32 మందికి కోవిడ్, ఆసుపత్రికి తరలింపు
కాగా.. కర్ణాటక రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలోని 32 మంది విద్యార్ధులకు Corona సోకడం కలకలం రేగింది. అయితే విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పాఠశాల వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం కేసుల తీవ్రత ఎక్కువగానే ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని Kodagu జిల్లా Madikeri జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన విద్యార్ధులకు కరోనా సోకింది. ఈ రెసిడెన్షియల్ స్కూల్‌లో 270 మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే 22 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలకు కరోనా సోకిందని స్కూల్ ప్రిన్సిపల్ చెప్పారు. 9వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్ధులు కరోనా బారినపడినట్టుగా స్కూల్ వర్గాలు తెలిపాయి. వారం రోజుల క్రితం విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తే 32 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో స్కూల్ ప్రిన్సిపల్ అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన విద్యార్ధులను ఐసోలేషన్ కు తరలించారు.
కరోనా సోకిన 32 మంది విద్యార్ధుల్లో కొందరికి కనీసం లక్షణాలు కూడా కన్పించలేదు. కేవలం 10 మంది విద్యార్ధుల్లో మాత్రమే కోవిడ్ లక్షణాలు కన్పించాయి. అయితే 22 మందికి మాత్రం ఎలాంటి లక్షణాలు కన్పించలేదని స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. మరోవైపు స్కూల్ లో పనిచేసే సిబ్బందిలో ఒకరు కరోనా బారినపడ్డారు. కరోనా బారిన పడిన వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.