75 ఏళ్ల స్వాతంత్య్ర భారతం అంతర్జాతీయ సూచీల్లో ఎక్కడ నిలుస్తున్నది?

By Mahesh KFirst Published Aug 7, 2022, 2:25 PM IST
Highlights

భారత్ 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత అంతర్జాతీయ సూచీల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో నిలుస్తున్నది. అగ్రశ్రేణిలో లేకున్నా.. మధ్యస్థ దశలో ఉంటున్నది.  ముఖ్యంగా హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో భారత్ మీడియం కేటగిరీలో ఉన్నది.

న్యూఢిల్లీ: భారత దేశం 1947లో బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత ఈ 75 ఏళ్ల కాలంలో ఏ మేరకు అభివృద్ధి సాధించింది. స్వతంత్ర భారత్ అంతర్జాతీయ సూచీల్లో ఏ స్థానాల్లో నిలబడుతున్నది. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న దేశ పౌరులకు ఇలాంటి విషయాలపై ఆసక్తి కలుగడం సహజమే. ఈ నేపథ్యంలోనే మనం కొన్ని కీలకమైన అంతర్జాతీయ ఇండెక్స్‌లను పరిశీలిద్దాం. ఆయా సూచీల్లో భారత్ పురోగతిలో ఉందా? తిరోగమనం చేస్తున్నదా? అనే విషయాలను చూద్దాం.

అంతర్జాతీయ సూచీల్లో ప్రధానమైనదిగా హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌ను చూద్దాం. ఎందుకంటే.. నేరుగా పేదరికాన్ని సూచించే సూచీల్లో అస్పష్టత ఎక్కువ. ఆ పేదరికం గురించి మానవ అభివృద్ధి సూచిక ద్వారా అంచనా వేద్దాం. ఎందుకంటే.. ఈ సూచీని మూడు అంశాల ఆధారంగా రూపొందిస్తారు. దీర్ఘ, ఆరోగ్యకర జీవనం, జ్ఞానాన్ని పొందే వీలు, మంచి జీవన ప్రమాణాలు అనే మూడు అంశీభూతాల ఆధారంగా సూచికను తయారు చేస్తారు.

2020 హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో మొత్తం 189 దేశాలు ఉండగా అందులో భారత్ 131వ స్థానంలో ఉన్నది. ఇతర  దేశాలతో పోల్చడం కంటే.. మన దేశం దాని క్రితం ఏడాది కంటే ఏ విధంగా ప్రదర్శన ఇస్తున్నది అనే విషయాలను చూద్దాం. ఈ సూచీలోని దేశాల జాబితాను నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు. లో, మీడియం, హై, వెరీ హై అనే కేటగిరీల్లో ఈ దేశాలను చేర్చుతారు. భారత్ 0.645 పాయింట్లతో మీడియం కేటగిరీలో ఉన్నది. 

1990 నుంచి 2019 వరకు భారత్ 0.429 పాయింట్ల నుంచి 0.645కి పెంచుకుంది. అంటే.. దాదాపు 50 శాతం పెరుగుదలగా ఐరాస తన నివేదికలో పేర్కొంది. 1990 నుంచి 2019 కాలంలో భారత జీవిత కాలం సుమారు 11.8 ఏళ్లు పెరిగింది. స్కూలింగ్ 3.5 ఏళ్లకు పెరిగింది. 

హ్యాపినెస్ ఇండెక్స్‌లో మాత్రం భారత్ తిరోగమిస్తున్నది. 2013లో 47.7 పాయింట్లు సాధించుకున్న భారత్ 2017లో ఈ పాయింట్లు 43.2కు, 2020లో ఈ పాయింట్లు 38.2కు పడిపోయాయి. 2022లో యూఎన్ విడుదల చేసిన హ్యాపినెస్ ఇండెక్స్‌లో భారత్ 136వ స్థానంలో ఉన్నది. మొత్తం 150 దేశాలకు ర్యాంక్ విడుదల చేసింది. గతేడాదితో పోల్చితే మూడు స్థానాలు ఎగబాకడం గమనార్హం.

కాగా, ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో మాత్రం మందకొడిగా పెరుగుతున్నది. 1999లో 45 పాయింట్ల నుంచి 2021లో 57కు పెరిగింది.

click me!