ప్రధాని అధ్యక్షతన మొదలైన నీతి ఆయోగ్ సమావేశం అజెండాలో కీలక అంశాలివే..!

By Mahesh KFirst Published Aug 7, 2022, 1:02 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ ఏడో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ఈ సమావేశంలో టాప్ ఎజెండాల్ నూతన విద్యా విధానం, నూనె గింజలు, ధాన్యాలు, ఇతర విషయాల్లో స్వయం సమృద్ధి సాధించడం, పంట వైవిధ్యత వంటి అంశాలు ఉన్నాయి.
 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. నీతి ఆయోగ్ ఏడో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఈ రోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మొదలైంది. జులై 2019 తర్వాత తొలిసారి ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న భేటీ ఇదే కావడం గమనార్హం.

ఈ భేటీ అజెండాలో కీలక విషయాలు ఉన్నాయి. నూనె గింజలు, ఇతర ధాన్యాలు, సాగుదారుల్లో స్వయం సమృద్ధి సాధించడం, జాతీయ విద్యా విధానం, సాగు వైవిధ్యత సహా పలు ఇతర అంశాలు ఉన్నాయి. 

నీతి ఆయోగో గవర్నింగ్ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు ఉంటారు. ఈ సమావేశం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా సమన్వయంతో నిర్ణయాలు తీసుకునేలా, తత్ఫలితంగా సమాఖ్య స్ఫూర్తిని చాటేలా ఉంటాయని ప్రధాని కార్యాలయం గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

నీతి ఆయోగ్ సమావేశానికి ఒక రోజు ముందే తెలంగాణ రాష్ట్రంలో ఈ భేటీ విషయమై తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి హాజరు కాబోవడం లేదని వెల్లడించారు. అందుకు పలు కారణాలు వెల్లడిస్తూ నీతి ఆయోగ్ సమావేశం ద్వారా ఒరిగేదేమీ లేదని, అందులో నిర్మాణాత్మక నిర్ణయాలు జరగడం లేదని ఆరోపించారు. టీమ్ ఇండియా అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు మాట్లాడటానికి పెద్దగా స్కోప్ ఉండదని, కేవలం కొన్ని నిమిషాల అవకాశం మాత్రమే ఉంటుందని తెలిపారు. మిగతా సమయం అంతా ఖాళీగా కూర్చుని పల్లీలు బుక్కాల్సి ఉంటుందని వ్యంగ్యం పోయారు. 

కేసీఆర్ వ్యాఖ్యలకు నీతి ఆయోగ్ కౌంటర్ ఇచ్చింది. కేసీఆర్ వ్యాఖ్యలు అవాస్తవాలని కొట్టిపారేసింది. నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని, కానీ, కేసీఆర్ తిరస్కరించారని వివరించింది. అలాగే, తెలంగాణకు కేంద్రం నుంచి అందిన ఆర్థిక మద్దతు గురించి ప్రస్తావించింది. 

అలాగే, ఈ నీతి ఆయోగ్ సమావేశానికి బిహార్‌లో అధికారాన్ని బీజేపీతో పంచుకుంటున్న జేడీయూ నేత, సీఎం నితీష్ కుమార్ కూడా రాబోవడం లేదని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ భేటీకి హాజరయ్యారు.

ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. నీతి ఆయోగ్ వీసీ, సీఈవోలు సాయంత్రం 5 గంటలకు సమావేశానికి సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడిస్తారు.

click me!