Manipur: అట్టుడుకుతోన్న మణిపూర్.. 5 రోజుల పాటు ఇంటర్నెట్ బంద్, 2 జిల్లాల్లో 144 సెక్షన్ 

By Rajesh KFirst Published Aug 7, 2022, 1:14 PM IST
Highlights

Manipur: మణిపూర్ అట్ట‌డుగుతోంది. ప‌లు చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకోవ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్ చేయ‌బ‌డ్డాయి.  బిష్ణుపూర్ జిల్లా ఎస్పీ రెండు నెలల పాటు జిల్లాలో 144 సెక్షన్ విధించారు.

Manipur: మణిపూర్‌లో ఉద్రిక్త‌త‌ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప‌లు చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘర్ష‌ణ‌లు మ‌తం రంగు పులుముకుంటున్నాయ‌ని భావించిన ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. రాష్ట్రంలో భ‌ద్ర‌త బ‌లాగాల‌ను మోహ‌రించింది. ప్రజలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో వివిధ సందేశాలు వైరల్ కావడంతో 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అలాగే.. వచ్చే రెండు నెలల పాటు చురచంద్‌పూర్, బిష్ణుపూర్ జిల్లాల్లో 144 సెక్షన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఘటనతో మత ఉద్రిక్తత నెలకొందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది మాత్రమే కాదు.. ప్రజలను రెచ్చగొట్టేలా రెచ్చగొట్టే ప్రకటనలు, సందేశాలను వ్యాప్తి చేయడానికి కొంత‌మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. దీంతో మొబైల్ డేటా సేవ నిలిపివేయబడ్డాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అస‌లేం జ‌రిగిందంటే..? 

మణిపూర్‌లోని హిల్స్‌ జిల్లాలకు సంబంధించి  ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం  రెండు సవరణ బిల్లులను తీసుకవ‌చ్చింది. ఈ స‌వ‌ర‌ణ బిల్లుల‌ను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం.. రాష్ట్ర జాతీయ రహదారులపై ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ (ATSUM) నిరసన ర్యాలీలు చేపట్టింది. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో.. వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మణిపూర్ (హిల్ ఏరియా) అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ బిల్లు 2021ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని విద్యార్థి సంస్థ డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనలో 30 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. వారిని 15 రోజుల పాటు జైలుకు తరలించారు.

మ‌రోవైపు.. అరెస్టైన నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ATSUM నాయకులు హైవేలను నిర్బంధించింది. ఈ క్ర‌మంలోనే.. పలువురు నేతలు వాహనాలకు నిప్పంటించిన‌ట్టు ఆరోపణలు వ‌స్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే మణిపూర్‌లో 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను మూసివేయాలని ప్రత్యేక కార్యదర్శి (హోమ్) హెచ్ జ్ఞాన్ ప్రకాష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మణిపూర్‌లో మతపరమైన హింస జరగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. కొన్ని దుష్ట శక్తులు.. ప్రజలను రెచ్చగొట్టే..వ్యాఖ్య‌లు చేయ‌డానికి సోషల్‌మీడియాను వినియోగిస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో చురాచంద్‌పూర్‌, బిష్ణుపూర్‌ జిల్లాలో రాబోయే రెండు నెలల పాటు సిఆర్‌పిసి కింద 144 సెక్షన్‌ను విధించింది.

 ఎందుకీ ఈ ఆందోళనలు...?   

రాష్ట్రంలోని లోయ ప్రాంతాల సమానమైన అభివృద్ధి, ఆర్థిక, పరిపాలన కోసం..  మణిపూర్ (కొండ ప్రాంతాలు) అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (సవరణ) బిల్లు 2021ని శాసనసభ వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టాలని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ (ATSUM)  డిమాండ్ చేసింది. అయితే..  ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మంగళవారం మణిపూర్ (హిల్ ఏరియా) జిల్లా పరిషత్ 6వ, 7వ సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. ఆ బిల్లుల తమ డిమాండ్లకు అనుగుణంగా లేదని ATSUM పేర్కొంది. సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుండి.. ఆదివాసీలు అధికంగా ఉండే కాంగ్‌పోక్పి, సేనాపతి పాంత్రాల‌ను మంగళవారం నుండి ATSUM పూర్తిగా మూసివేయబడింది.

click me!