
మిలిటరీ డ్రోన్‌ల తయారీలో భారతీయులు చైనాలో తయారైన విడిభాగాలను ఉపయోగించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. భద్రతా లోపాలపై తీవ్రమైన ఆందోళనల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నలుగురు రక్షణ, పరిశ్రమల అధికారులను ఉటంకిస్తూ ఈ నివేదిక పేర్కొంది. డ్రోన్ కమ్యూనికేషన్ , మానవరహిత వైమానిక వాహనాల కెమెరాలు, రేడియో ట్రాన్స్‌మిషన్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌లలో చైనా తయారు చేసిన విడిభాగాల ద్వారా ఆ దేశం భారత్‌పై నిఘా పెడుతోందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మే 2020లో తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి భారత సైన్యం, బీజింగ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సైనికపరంగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో చైనాలో తయారయ్యే విడిభాగాల దిగుమతుల్ని పరిమితం చేయాలని న్యూఢిల్లీ నిర్ణయించింది. రాయిటర్స్ చేసిన ఇంటర్వ్యూలో పలురురు ప్రభుత్వ అధికారులు, రక్షణ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొని చైనా విడిభాగాల దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో డ్రోన్ సెంటర్ల గురించి చర్చించడానికి ప్రభుత్వం ఫిబ్రవరి, మార్చిలలో రెండు సమావేశాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాయిటర్స్ సమీక్షించిన నివేదిక ప్రకారం.. భారతదేశంతో భూ సరిహద్దులను పంచుకునే దేశాల నుంచి పరికరాలు, ఉపకరణాలు భద్రతా కారణాల రీత్యా ఆమోదయోగ్యం కాదని సైనిక అధికారులు అన్నారు. దీని అర్ధం చైనా తయారీ పరికరాలు, విడిభాగాలు.
ఇకపోతే.. ఇదే భద్రతా కారణాలతో చైనాలో తయారైన డ్రోన్‌లు, విడిభాగాల కొనుగోలు, వాడకాన్ని అమెరికా రక్షణ శాఖ 2019లో నిషేధించింది. దేశీయ తయారీని పెంచేందుకు అధిక ఖర్చులను తగ్గించుకునేందుకు దేశం సన్నద్ధం కావాలని భారత రక్షణ శాఖ అధికారి ఒకరు రాయిటర్స్‌తో అన్నారు. ప్రస్తుతం తాను చైనా నుంచి పరికరాలను కొనుగోలు చేస్తున్నానని.. కానీ తాను వాటిని భారత్‌లో తయారు చేయాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. కాగా.. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి కోసం బడ్జెట్‌లో నాలుగింట ఒక వంతు ప్రైవేట్ పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించారు.