
న్యూఢిల్లీ: ఒక వైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు జరుగుతుంటే.. మరోవైపు రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల చుట్టే ప్రపంచ దేశాలన్నీ చర్చించుకునే స్థితి నెలకొంది. రష్యాకు ముకుతాడు వేయడానికి అమెరికా ఈ ఆంక్షలు వేసింది. కానీ, ఆ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి లేదా కొంతలో కొంతైనా ఉపశమనం పొందడానికి రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. తాము ఎగుమతి చేస్తున్న చమురును మరింత చౌకగా మిత్రదేశాలకు అమ్మాలని నిర్ణయించుకుంది. తద్వారా దాని ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవాలని భావిస్తున్నది. ఇప్పటికే దీనికోసం భారత్ సహా పలుదేశాలకు రష్యా ఆఫర్ ఇచ్చింది. భారత్ కూడా అందుకు సిద్ధమైంది. కానీ, రష్యా ఆఫర్‌ను భారత్ స్వీకరించాలనుకోవడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతున్నది.
అందుకే రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకుంటే భారత్ తర్వాతి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించింది. అంతేకాదు, ఒక వేళ సరిహద్దులో చైనా కయ్యానికి కాలు దువ్వినా.. భారత్‌కు సహాయం చేయడానికి రష్యా ముందుకు రాదని పేర్కొంది. ఎందుకంటే, చైనా, రష్యాల మధ్య సంబంధాలు అన్‌లిమిటెడ్ అని తెలిపింది. కానీ, రష్యా మాత్రం సింపుల్‌గా భారత్, రష్యాల మధ్య సంబంధాలను ఇతర దేశాలే శాసించలేవని, అమెరికా దాని విధానాలనే ఇతర దేశాలూ అనుసరించాలని డిమాండ్ చేస్తున్నదని రష్యా ఖండించింది. భారత్ కూడా అమెరికాకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అసలు రష్యా నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకునే ఐరోపా దేశాలేనని స్పష్టం చేసింది. రష్యా నుంచి తాము ఆయిల్ కొనుగోలు చేస్తామని మరో ప్రకటనలో వెల్లడించింది.
ప్రపంచ దేశాల పరిస్థితులు ఇలా ఉండగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్‌తో భేటీ కావడం చాలా దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవలి కాలంలో చాలా దేశాల మంత్రులు భారత్ పర్యటించారు. కానీ, మోడీ వారితో భేటీ కాలేదు. యూకే ఫారీన్ మినిస్టర్ లిజ్ ట్రస్ ఇప్పటికే ఇండియాలో ఉన్నప్పటికీ ఆయనతో ప్రధాని సమావేశం కాలేదు. ఒక వారం క్రితం భారత్ పర్యటించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటించారు. ప్రధాని మోడీతో భేటీ కావడానికి అపాయింట్‌మెంట్ అడిగారు. కానీ, మోడీ తిరస్కరించారు. దీంతో ఆయన ప్రధాని మోడీని కలువకుండానే తదుపరి గమ్యస్థానం నేపాల్‌కు చేరుకున్నారు. ఇటీవలే అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దలీప్ సింగ్‌తోనూ మోడీ సమావేశం కాలేదు. కానీ, రష్యా విదేశాంగ మంత్రితో సమావేశం కావడం చర్చనీయాంశంగానే మారింది. భారత్ దౌత్యపరంగా ఏ దేశానికి ప్రాధాన్యత ఇస్తున్నది? ఏ దేశాలతో భారత్ గాఢమైన సంబంధాలను నెరపుతున్నదనే విషయాలను ఈ సమావేశం వెల్లడించింది. ఎందుకంటే.. ఈ 15 రోజుల్లో యూకే, చైనా,
ఆస్ట్రియా, గ్రీస్, మెక్సికోల నుంచీ మంత్రులు భారత్ పర్యటించినా.. మోడీ ఎవరితోనూ భేటీ కాలేదు. భారత్ ప్రభుత్వం ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నది? ఎవరితో సంబంధాలు బలంగా కోరుకుంటున్నది? కొనసాగిస్తున్నదీ? నరేంద్ర మోడీ, సెర్జీ లావరోవ్‌ల సమావేశం వెల్లడించిందని నిపుణులు చర్చిస్తున్నారు.