ఉక్రెయిన్ పై రష్యా అణుదాడిని ఆపడంలో భారత్ ది కీలక పాత్ర - సీఎన్ఎన్ రిపోర్ట్

By Sairam Indur  |  First Published Mar 10, 2024, 9:25 PM IST

2022లో రష్యా ఉక్రెయిన్ పై అణుదాడి వేసేందుకు ప్రయత్నించిందని అమెరికాకు చెందిన సీనియర్ అధికారులు వెల్లడించారు. అయితే దీనిని నివారించడంలో భారత్ కీలక పాత్ర పోషించందని వారు తెలిపారు. 
 


2022లో ఉక్రెయిన్ పై రష్యా అణుదాడిని ఆపడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని సీఎన్ఎన్ రిపోర్ట్ వెల్లడించింది. ఆ ఏడాది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఉధృతం చేయాలని, అణుదాడి చేయాలని ప్రయత్నించింది. అయితే దీనిని పసిగట్టిన అమెరికా.. ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర ప్రపంచ నాయకులను సంప్రదించిందని ఇద్దరు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీఎన్ఎన్ తెలిపారు.

1945లో హిరోషిమా, నాగసాకి బాంబు దాడుల తర్వాత తొలిసారిగా రష్యా అణుదాడికి దిగవచ్చని భయపడిన అమెరికా.. దానిని నివారించేందుకు కఠిన సన్నాహకాలు ప్రారంభించింది. ప్రధాని మోడీ, ఇతర ప్రపంచ నాయకులతో సంప్రదింపులు జరిపింది. దీంతో ప్రధాని మోడీ చొరవ ఈ దాడిని నిలిపివేయడంలో కీలక పాత్ర పోషించాయని అధికారులు తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహాత్మకంగా అణ్వాయుధాలను ఉపయోగించవచ్చని అమెరికా ఆందోళన చెందింది. దీంతో రష్యా ప్రయత్నాలను ఆపేందుకు బైడెన్ ప్రభుత్వం భారతదేశంతో సహా మిత్రేతర దేశాల సహాయం కోరింది. 

Latest Videos

తమ దేశం రష్యాకు నేరుగా అణుదాడిని ఆపాలని నేరుగా చెప్పడంతో పాటు ఇతర దేశాలను కూడా అలాగే చేయాలని కోరిందని అధికారులు వెల్లడించారు. ఒక వేళ అణుదాడి జరిపితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని రష్యాకు తమ దేశం చెప్పిందని పేర్కొన్నారు. భారత్, చైనా తదితర దేశాలు కూడా ఈ విషయంలో పుతిన్ కు చెప్పాయని, ఇది కూడా దాడిని నివారించేందుకు సహాయపడ్డాయని చెప్పారు. 

కాగా..  రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుండి భారత్ శాంతి వైఖరినే ప్రదర్శించింది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించింది.యుద్ధంలో పౌరుల మరణాలను ఖండించింది. గత ఏడాది ఉజ్బెకిస్థాన్ లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ పుతిన్ తో మాట్లాడుతూ 21వ శతాబ్దం 'యుద్ధ యుగం' కాదని అన్నారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సులో కూడా ఈ ప్రకటన చేశారు.

2022 వేసవి చివరి నుంచి 2022 చివరి వరకు ఒక వేళ అనుదాడి జరిగితే ప్రణాళికలను రూపొందించడానికి జాతీయ భద్రతా మండలి వరుస సమావేశాలను నిర్వహించిందని అధికారులు తెలిపారు. రష్యా అణ్వాయుధంతో దాడి చేయబోతోందని స్పష్టమైన సాంకేతాలు అందితే, తాము ఎలా స్పందిస్తామో, ఎలా నిరోధించాలో చర్చించామని అధికారులు చెప్పారు.

click me!