Gujarat: పాకిస్తాన్ కోసం గూఢచర్యం.. గుజరాత్‌లో మరో అరెస్టు

Published : May 24, 2025, 10:46 PM IST
Sahdev Singh Gohil. (Photo/Gujarat ATS)

సారాంశం

India Pakistan Tensions: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ సున్నితమైన సమాచారం పంపించాడనే ఆరోపణలపై కచ్‌లో ఒక ఆరోగ్య కార్యకర్తను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. 

India Pakistan Tensions: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య దేశంలో పాకిస్తాన్ స్పై అంశం ఆందోళనలు పెంచుతోంది. ఇప్పటికే పలువురు పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయారు. తాజాగా గుజరాత్ రాష్ట్రం కచ్ సరిహద్దు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఒక ఆరోగ్య కార్యకర్తను పాకిస్తాన్ కు గూఢచర్యం చేసినట్లు ఆరోపణలతో గుజరాత్ ఎంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. నిందితుడు సహదేవ్‌సింగ్ దీపు‌భా గోహిల్ (28), మాతా-నా-మాధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.

గుజరాత్‌లో ఎనిమిది నెలల వ్యవధిలో ఇది మూడవ గూఢచర్యం కేసు కావడం జాతీయ భద్రతా సంస్థలను అలర్ట్ చేసింది. గోహిల్‌పై పాకిస్తాన్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెంట్ “ఆదితి భారద్వాజ్” అనే తప్పుడు పేరుతో గూఢచారిగా వ్యవహరించిన వ్యక్తికి భారత సరిహద్దు భద్రతా దళాలు (BSF), భారత నౌకాదళ (Indian Navy) స్థావరాల ఫోటోలు, వీడియోలు పంపినట్టు ఏటీఎస్ తెలిపింది.

ఏటీఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గోహిల్‌ 2023 జూన్ - జూలైలో వాట్సాప్‌ ద్వారా “ఆదితి భారద్వాజ్”తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతనిని క్రమంగా ప్రలోభపెట్టి, కచ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న, తాజాగా పూర్తైన రక్షణ సంబంధిత సదుపాయాల చిత్రాలను పంపించమని ఒత్తిడి తెచ్చినట్టు గుర్తించారు.

2025 జనవరిలో గోహిల్ తన ఆధార్ కార్డు ఉపయోగించి కొత్త సిమ్ కార్డు తీసుకుని, వాట్సాప్ యాక్టివేట్ చేసిన తరువాత, మొబైల్‌ను హ్యాండ్లర్‌కు అప్పగించి, డేటా పంపించడం కొనసాగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచార సేవలందించడానికిగాను అతనికి రూ. 40,000 నగదు మూడవ వ్యక్తి ద్వారా అందిందని అధికారులు వెల్లడించారు.

ఈ అరెస్టు సాంకేతిక సమాచారంతో పాటు మానవ నిఘా ఆధారాల ద్వారా, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల సహకారంతో కొనసాగిన ఆపరేషన్ లో భాగంగా ఉంది. మే 1న గోహిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. గోహిల్, ఆయన హ్యాండ్లర్ పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 61, 148 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గోహిల్ మొబైల్‌ ఫోన్‌లోని డిలీట్ అయిన డేటాను రికవర్ చేసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు.

ఇదే తరహాలో గతంలో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. 2024 నవంబర్ 29న, దేవభూమి ద్వారకలో దిపేష్ బటుక్ ను భారత తీర భద్రతా దళాల సమాచారం ఫేస్‌బుక్‌లో “సహిమా” అనే పాక్ నేవీ అధికారిగా పేర్కొన్న వ్యక్తికి లీక్ చేసిన కేసులో అరెస్ట్ చేశారు. అలాగే, అక్టోబర్ 26న, పంకజ్ కొటియాను పోర్బందర్‌లో అరెస్ట్ చేశారు. అతను “రియా” అనే పాక్ హ్యాండ్లర్‌కు నౌకాశ్రయాల్లో నౌకల కదలికల సమాచారాన్ని పంపినట్టు ఆరోపణలు ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?