
India Pakistan War: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. అయితే పాకిస్తాన్ వైమానిక దళం ద్వారా దాడి చేయాలని చూస్తే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన S-400 భారత్ తరపున కౌంటర్ ఇస్తుంది.
ఇండియా రష్యా నుంచి S-400 కొనుగోలు చేసి పాకిస్తాన్ సరిహద్దులో మోహరించింది. S-400 రాడార్ పరిధి 600 కి.మీ. పాకిస్తాన్ లోపలి వైమానిక స్థావరాలపై కూడా నిఘా పెట్టవచ్చు. పాకిస్తాన్ నుంచి ఏ విమానం గాల్లోకి లేచినా ఇండియాకు తెలుస్తుంది. S-400 క్షిపణి పరిధి 400 కి.మీ. AWACS, ఇంధన ట్యాంకర్ లాంటి పెద్ద విమానాలను 400 కి.మీ. దూరం నుంచే కూల్చేయవచ్చు. ఇండియా సరిహద్దు దాటకముందే యుద్ధ విమానాలను కూడా నాశనం చేయవచ్చు.
S-400 లో మల్టీ ఫంక్షన్ రాడార్, ఆటోనమస్ డిటెక్షన్ అండ్ టార్గెటింగ్ సిస్టం, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టం, లాంచర్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. నాలుగు రకాల క్షిపణులను ప్రయోగించవచ్చు. విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను నాశనం చేయవచ్చు. 400 కి.మీ. దూరం, 30 కి.మీ. ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఒకేసారి 36 లక్ష్యాలపై దాడి చేయగలదు.
S-400 నాలుగు రకాల క్షిపణులను ఉపయోగిస్తుంది. 48N6DM క్షిపణి పరిధి 250 కి.మీ. 40N6 క్షిపణితో 400 కి.మీ. దూరం వరకు దాడి చేయవచ్చు. దీన్ని AWACS, ఇంధన ట్యాంకర్ లాంటి పెద్ద విమానాలపై ప్రయోగిస్తారు. యుద్ధ విమానాల కోసం 9M96E, 9M96E2 క్షిపణులను ప్రయోగిస్తారు. 9M96 పరిధి 120 కి.మీ.
S-400 ఫైర్ కంట్రోల్, టార్గెట్ ట్రాకింగ్ రాడార్ 92N6E. దీన్ని MZKT-7930 8×8 వాహనంపై అమర్చుతారు. 91N6E బిగ్ బర్డ్ అక్విజిషన్ అండ్ బ్యాటిల్ మేనేజ్ మెంట్ రాడార్ కూడా ఉంటుంది. ఈ రాడార్ 600 కి.మీ. దూరంలోని విమానాలు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణులు, గైడెడ్ క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను గుర్తించగలదు. ఒకేసారి 300 లక్ష్యాలపై నిఘా పెట్టగలదు. S-400 లో SP85TE2 లాంచర్ ఉంటుంది. ఒక లాంచర్ లో నాలుగు క్షిపణులను ఉంచవచ్చు.