భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆహ్వానం పంపారు. అయితే, బైడెన్ ఇందుకు నిరాకరించారు. దీనికి కారణాలు ఏమై ఉంటాయా? అనే చర్చ జరుగుతున్నది. ఈ తరుణంలోనే ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రన్‌కు ఆహ్వానం పంపినట్టు సమాచారం.
Republic Day: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇతర దేశ అధినేతలు ముఖ్య అతిథులుగా విచ్చేయడం ఆనవాయితీగా వస్తున్నది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు నెలల ముందుగానే ముఖ్య అతిథిని ఎంచుకుని అధికారులు ఆహ్వానం పంపిస్తారు. ఇలాగే.. రానున్న గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్‌కు ఆహ్వానం పంపారు. అయితే, ఆయన నిరాకరించారు. దీంతో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్‌కు ఆహ్వానం పంపినట్టు సమాచారం.
జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలకు ఈ సారికి ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్‌కు ఆహ్వానం పంపినట్టు ఇందుకు సంబంధించి కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రాబోతున్న ఆరో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఈయన. అయితే, ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రన్‌కు ఆహ్వానం పంపిన దానిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
మాక్రన్ కంటే ముందు బైడెన్‌కు ఆహ్వానం పంపగా.. ఆయన నిరాకరించారు. జనవరిలో న్యూ ఢిల్లీకి రావడం చాలా కష్టం అని బైడెన్ సమాధానం చెప్పినట్టు తెలిసింది. ఇందుకు కారణాలు ఏమై ఉంటాయా? అనే అన్వేషణ మొదలైంది. జనవరిలో లేదా ఫిబ్రవరి తొలినాళ్లలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్ చేయాల్సి ఉన్నది. అలాగే.. మరోసారి అమెరికా అధ్యక్ష బరిలో నిలబడాలని అనుకుంటున్నారు. అందుకు సంబంధించిన నిర్ణయాలు, కసరత్తులపై దృష్టి పెట్టాల్సి ఉన్నది. దీనికితోడు ఇప్పుడు ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణ కొనసాగుతూనే ఉన్నది. ఈ అంశంపైనా ఆయన దృష్టి సారించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలోనే జనవరిలో భారత్‌కు వచ్చే ఆహ్వానాన్ని బైడెన్ నిరాకరించినట్టు తెలుస్తున్నది.
Also Read: Ayodhya: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ!.. ఆహ్వానంపై దిగ్విజయ్ సింగ్ కామెంట్
ఫ్రెంచ్‌తో భారత అనుబంధం వేగంగా బలపడుతూ వస్తున్నది. ముఖ్యంగా రక్షణ రంగంలో ఫ్రాన్స్ నుంచి భారత్‌కు యుద్ధ విమానాల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది జులైలో ఫ్రెంచ్ నేషనల్ డే సెలబ్రేషన్‌లో భాగంగా నిర్వహించే బాస్టిల్ డే పరేడ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అతిథిగా వెళ్లారు.