
Independence Day 2025: ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం. దాదాపు 200 ఏళ్ళు బ్రిటిష్ వారి పాలనలో ఉన్నాం. స్వాతంత్య్ర భారతం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన తర్వాత 1947లో స్వాతంత్య్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభభాయ్ పటేల్, భగత్ సింగ్ లాంటి నాయకులు స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించారు. కొందరు అహింసా మార్గాన్ని ఎంచుకుంటే.. మరికొందరూ విప్లవ మార్గంలో పోరాటాలు చేశారు. వారు అందించిన స్వేచ్ఛను గౌరవిస్తూ, బాధ్యతగా జీవించాలి.
చరిత్రను మార్చిన క్షణం!
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం బలహీనపడటంతో, భారతదేశానికి స్వాతంత్య్రం దక్కే మార్గం సులభమైంది. 1947 జూలైలో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆమోదం పొందింది. దీని ఫలితంగా భారత్, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడ్డాయి. 1947 ఆగస్టు 14-15 అర్ధరాత్రి, భారతదేశం అధికారికంగా స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ చారిత్రాత్మక క్షణంలో, జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటులో "Tryst with Destiny" అనే ప్రసిద్ధ ప్రసంగాన్ని ఇచ్చారు. ఈ గౌరవించదగిన స్వాతంత్య్రం వెనుక ఉన్న త్యాగాల జ్ఞాపకంగా, ప్రతి ఆగస్టు 15న మనం తలవవచ్చు.
స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత
స్వాతంత్య్ర దినోత్సవం కేవలం సెలవుదినం కాదు; ఇది భారత గర్వానికి, ఐక్యతకు, తెగువకు ప్రతీక. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాన్ని గుర్తు చేసుకునే పవిత్రమైన, పర్వదినం. ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి, దేశ ప్రగతి, సవాళ్ళు, భవిష్యత్తు లక్ష్యాలపై ప్రసంగిస్తారు.
దేశవ్యాప్తంగా పరేడ్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలు, జెండా వందనాలు జరగడం ఈ రోజు ప్రత్యేకత. స్కూల్స్, కాలేజీలు, సంస్థలు నాటకాలు, పాటలు, నృత్యాలు, రచన పోటీలు నిర్వహిస్తూ దేశభక్తిని పెంపొందిస్తాయి. రోజు మతం, భాష, ప్రాంత భేదం లేకుండా భారతీయులంతా ఒక్కటై దేశానికి అంకితభావంతో జరుపుకుంటారు.
నేటికీ ఆగస్టు 15 ఎందుకు ప్రత్యేకం?
స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దాలు గడిచినా, ఆగస్టు 15 ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. ఈ రోజు మన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలపై మనం ఆలోచించే అవకాశం. ఇది మనం బాధ్యతాయుతమైన పౌరులుగా మన పాత్రను గుర్తుచేసుకునే సందర్భం కూడా ఇదే.
ప్రతి సంవత్సరం మనం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ, చరిత్రను గౌరవిస్తూ, భవిష్యత్తును ఆశతో, గర్వంగా, దృఢ సంకల్పంతో ఎదుర్కొంటున్నాం. ఐక్యత, వికాసం, సమాజ హితం అనే లక్ష్యాలతో బలమైన భారత్‌ను నిర్మించడమే మన ముందున్న మార్గం.