
చెన్నైలో జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్‌కు సంబంధించిన ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు ఉండేలా చూడాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ గురువారం ఆదేశించింది. ఒలింపియాడ్ ప్రకటనల్లో, ప్రమోషన్‌లలో సీఎం ఎంకే స్టాలిన్ ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయని ఆరోపిస్తూ న్యాయవాది ఆర్ రాజేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫొటోలు లేవని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ మునీశ్వర్‌నాథ్ భండారీ, జస్టిస్ ఎస్ అనంతితో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపి ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్న మోడీ సర్కారు.. సోనియాకు అఖిలేష్ మద్దతు
2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఫొటోలను ప్రచురించేటప్పుడు అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఉన్నాయని రాజేష్ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాధనంతో ప్రకటనలు చేసినందుకు, అలాగే సుప్రీంకోర్టు తీర్పును పాటించనందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరుఫున హాజరైన విచారణకు హాజరైన అడ్వకేట్ జనరల్ ఆర్ షుణ్ముగసుందరం దీనికి సమాధానం ఇచ్చారు. ఆ నాయకుల ఫొటోలు పెట్టకూడదని ప్రభుత్వం ఎప్పుడూ భావించలేదని అన్నారు. ఒలింపియాడ్‌కు సంబంధించిన గ్రౌండ్‌వర్క్ జరుగుతున్న సమయం నాటికి రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. అందువల్ల రాష్ట్రపతి ఫోటోను ప్రచురించడం సాధ్యం కాలేదని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జులై 22వ తేదీన మాత్రమే ప్రధాని సమ్మతి తెలిపారని, ఆ తర్వాత ప్రచురించిన అన్ని ప్రకటనల్లో ఆయన ఫోటోలు కూడా ఉన్నాయని అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. అయితే ఈ కారణాలను ధర్మాసనం తోసిపుచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా రాష్ట్రపతి ఫోటో లేకుండానే ప్రకటనలు వెలువడ్డాయని అన్నారు. ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించక పోయినా ఆయన ఫోటోను ప్రచురించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
పక్కా స్కెచ్ తో యజమాని ఇంట్లో రూ. 8 కోట్లు చోరీ చేసిన పనిమనిషి..
‘‘ మన దేశం ఒక అంతర్జాతీయ ఈవెంట్‌ను ఇక్కడ జరపాలని భావిస్తున్నప్పుడు దానిని సమర్ధవంతంగా నిర్వహించడం, అంతర్జాతీయ స్థాయిలో చెరగని ముద్ర వేసేలా చూసుకోవడం అందరి బాధ్యత. అందువల్ల దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి ఇది అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి ఈవెంట్ ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రానికి చెందిన సీఎం చేతిలో కాకుండా రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది.’’ అని అన్నారు.
రోడ్డు ప్రమాదాలతో 5.82 లక్షల మంది మృతి: ప్రభుత్వం
సుప్రీంకోర్టు తీర్పును భవిష్యత్తులో ఖచ్చితంగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఫొటోలతో కూడిన ప్రకటనలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఏవైనా ఘటనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని వారు తెలిపారు. అయితే ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని పిటిషనర్ చేసిన డిమాండ్ కు బెంచ్ సమాధానం ఇస్తూ.. నిర్వాహకులు తప్పును గ్రహించారని అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించడం, అంతర్జాతీయ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేయడమే క్షమాపణలు చెప్పడానికి ఉత్తమ మార్గం అని పేర్కొంది.