
UP Assembly Election 2022: దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 7దశల్లో జరగనున్న యూపీ ఎన్నికల్లో మొదటిదశ పోలింగ్ గురువారం 7 గంటలకు ప్రారంభమైంది. 11 నెలల రైతుల నిరసన కేంద్రమైన రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోని మొదటి దశ ఓటింగ్ కొనసాగుతోంది. ఈ మొదటి దశలో పశ్చిమ యూపీలోని 11జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 623 మంది అభ్యర్థులు ఈ మొదటి దశలో పోటీలో నిలిచారు.
ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో ఆగ్రా రూరల్ స్థానంలో బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ అభ్యర్థి బేబీ రాణి మౌర్య గురువారం ఉదయం తన ఓటును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యూపీ ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారనీ, వరుసగా రెండో సారి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఆగ్రాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలుచుకోవడం ఖాయమని అన్నారు. "నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. గతసారి ఆగ్రాలోని మొత్తం 9 స్థానాలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలుచుకుంది. ఈసారి కూడా మేము తొమ్మిదికి తొమ్మిది స్థానాలను గెలుచుకుంటాము" అని బేబీ రాణి మౌర్య తన ఓటును వినియోగించుకున్న అనంతరం మీడియాతో అన్నారు.
అలాగే, రాజకీయాల్లో సవాళ్లను ప్రజలు స్వీకరించాలని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, ఆగ్రా రూరల్ స్థానం బీజేపీ అభ్యర్థి బేబీ రాణీ మౌర్య అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి అభివృద్ధే ఏకైక ఎజెండా అని పేర్కొన్నారు. గత వారం కూడా మౌర్య మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ.. బీజేపీ, ఆ పార్టీ నేతలు కుల వివక్షను వ్యాప్తి చేస్తున్నారనీ, మహిళలు, దళితుల సంక్షేమానికి కృషి చేయడం లేదని ఆరోపించారు. ఈ ఆరోపణలను కొట్టిపారేసిన బేబీ రాణి మౌర్య.. ఎల్లప్పుడూ మహిళలకు అధికారం ఇచ్చే ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. "మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ సాయపడింది. బీజేపీ నన్ను ఉత్తరాఖండ్ గవర్నర్‌గా చేసింది. మహిళల సంక్షేమం కోసం బీజేపీ చేసినంతగా ఎవరూ చేయలేదు" అని మౌర్య అన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మొదటిదశలో గురువారం నాడు 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో షామ్లీ, మధుర, ఆగ్రా, ముజఫర్‌నగర్, బాగ్‌పట్, మీరట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, హాపూర్, బులంద్‌షహర్, అలీగఢ్ లు ఉన్నాయి. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (UP Assembly Election 2022) జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. గురువారం ప్రారంభమైన యూపీ మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల బరిలో 623 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో 73 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత అసెంబ్లీల గడువు మార్చి 14తో ముగుస్తుంది. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య గట్టి పోరు ఉండనుందని ప్రస్తుత రాజకీయ పరిణమాలు గమనిస్తే తెలుస్తోంది.