
దేశంలో కరోనా కేసులు (Corona Cases) తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ప్రయాణికులకు ప్రస్తుతం అమలు చేస్తోన్న మార్గదర్శకాలను సవరించింది. కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న సమయంలో తీసుకొచ్చిన ఎట్ రిస్క్ దేశాల కేటగిరిని తొలగించింది. ప్రస్తుతం ఎట్ రిస్క్ దేశాల నుంచి 7 రోజుల నుంచి క్వారంటైన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎట్ రిస్క్ దేశాల కేటగిరిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే విదేశీ ప్రయాణికులు ప్రస్తతం 7 రోజుల క్వారంటైన్‌కు బదులుగా.. 14 రోజులు స్వీయ పర్యవేక్షణకు (Self Monitoring) సిఫారసు చేసింది.
అంతేకాకుండా 8వ రోజున RT-PCR పరీక్ష చేయించుకుని.. దానిని Air Suvidha పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉందని పేరకొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఫిబ్రవరి 14 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. నిరంతరం మారుతున్న కోవిడ్ వైరస్‌ను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో ఆర్థిక కార్యకలాపాలను అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ తప్పనిసరిగా Air Suvidha వెబ్ పోర్టల్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను నింపాలి. అలాగే 14 రోజుల ట్రావెల్ హిస్టరీని పొందుపరచాలి. ప్రయాణికులు తప్పనిసరిగా వారి ప్రయాణానికి 72 గంటల మందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్షల నెగిటివ్ రిపోర్ట్‌ను అప్‌లోడ్ చేయాలి.
ప్రత్యామ్నాయంగా కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయవచ్చు. అయితే ఈ ఎంపిక 72 దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే.. ఆ దేశాల వ్యాక్సిన్ కార్యక్రమాలను భారత ప్రభుత్వం పరస్పర కార్యక్రమంలో భాగంగా గుర్తించింది. ఇలా గుర్తించిన దేశాల్లో కెనడా, హాంకాంగ్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, బహ్రెయిన్, ఖతార్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కొన్ని యూరోపియన్ దేశాలు ఉన్నాయి.
సెల్ఫ్ డిక్లరేషన్ పామ్‌లో మొత్తం సమాచారం నింపి, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ లేదా కోవిడ్ రెండు డోసుల సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేసిన ప్రయాణికులను మాత్రమే ఎయిర్‌లైన్స్ బోర్డింగ్ అనుమతించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎటువంటి లక్షనాలు లేని వారిని విమానంలో ప్రయాణించడానికి అనుమతించాలని తెలిపింది. ప్రయాణ సమయంలో ఫేస్ మాస్క్‌లు, భౌతిక దూరం వంటి కోవిడ్ కట్టడి చర్యలు తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొంది. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత థర్మల్ స్క్రీనింగ్ చేయాలని తెలిపింది. అంతేకాకుండా ర్యాండమ్‌గా ఎంపిక చేయబడిన ప్రయాణికుల (ఒక విమానంలోని మొత్తం ప్రయాణీకులలో రెండు శాతం వరకు) RT-PCR పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.