ఢిల్లీ కారు ప్రమాదం: రేప్ అనుమానాలకు బ్రేక్! పోస్టుమార్టంలో కీలక విషయం.. ‘ప్రైవేట్ పార్టులకు గాయాలు లేవు’

By Mahesh KFirst Published Jan 3, 2023, 1:39 PM IST
Highlights

ఢిల్లీలో న్యూ ఇయర్ రోజునే జరిగిన కారు ప్రమాదంలో మరణించిన యువతిపై లైంగిక దాడి కూడా జరిగి ఉంటుందనే అనుమానాలకు అటాప్సీ రిపోర్టు బ్రేక్ వేస్తున్నది. యువతి ప్రైవేట్ పార్టులపై గాయాలేవీ లేవని విశ్వసనీయవర్గాలు వివరించాయి.
 

న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన తొలిరోజే దేశ రాజధాని ఢిల్లీలోని సుల్తాన్‌పురి ఏరియాలో దారుణ ఘటన జరిగింది. తెల్లవారుజామున ఓ కారు స్కూటీని ఢీకొట్టింది. ఆ స్కూటీపై ఉన్న యువతి కాలు కారు యాక్సిల్‌లో ఇరుక్కుపోయింది. దీంతో ఆ కారు యువతిని సుమారు 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనను చూసిన కొందరు పోలీసులకు చెప్పడంలో అధికారులు అలర్ట్ అయ్యారు. కారులోని యువకులను అరెస్టు చేశారు. అయితే, ఇది కేవలం రోడ్డు ప్రమాదం కాకపోవచ్చని, ఆ యువతిపై లైంగిక దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలూ బయల్దేరాయి. ఈ నేపథ్యంలో యువతి పోస్టుమార్టం రిపోర్టులో కొన్ని విషయాలు ఈ అనుమానాలపై స్పష్టత ఇస్తున్నాయి.

ఆ యువతిపై లైంగిక దాడి జరిగి ఉండే అవకాశం లేదని పోస్టుమార్టం నివేదిక చూసిన కొన్ని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆ యువతి ప్రైవేట్ పార్టుకు ఎలాంటి గాయాలు లేవని వివరించాయి. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ బోర్డు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ అటాప్సీ రిపోర్టును మధ్యాహ్నం 2 గంటలకు పోలీసులకు సమర్పించనున్నట్టు ఆ వర్గాలు వివరించాయి. మరిన్ని టెస్టుల కోసం స్వాబ్ శాంపిల్స్‌ను భద్రపరిచారు. అలాగే, ఆమె జీన్స్ ప్యాంట్ ముక్కలను దాచిపెట్టినట్టు తెలిపాయి.

ఢిల్లీ కారు ప్రమాదంలో మరణించిన యువతి అంజలి సింగ్ ‌ఇంట్లో పెద్ద కూతురు. తండ్రి లేని ఆ కుటుంబానికి ఆమెనే జీవనాధారం. ఇది కేవలం ఒక రోడ్డు ప్రమాదం కాదని అనుమానించిన వారిలో అంజలి తల్లి కూడా ఉన్నారు.

Also Read: ఢిల్లీ కారు ప్రమాదం : కుటుంబానికి ఆ యువతే ఆధారం.. 8యేళ్ల క్రితం తండ్రి మృతి.. నలుగుర్ని పోషించే బాధ్యత ఆమెపై..

కానీ, పోలీసులు ఈ అనుమానాలను కొట్టిపారేశారు. అంజలిని ఢీకొట్టిన కారు నుంచి ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. హత్య అని కాకుండా నిందార్హమైన హత్యగా పేర్కొన్నారు. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం మూలంగా ఈ మరణం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ యువతిపై లైంగికదాడి జరిగిందనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు.

దీనికి తోడు ప్రమాదం జరిగినప్పుడు అంజలితో స్నేహితురాలు నిధి కూడా ఉన్నది. అంజలి కాలు కారు యాక్సిల్‌లో ఇరుక్కుని ఈడ్చుకెళ్లిపోతుండగా.. గాయపడకుండా సురక్షితంగా ఉన్న ఆమె స్పాట్ నుంచి భయంతో పారిపోయింది. ఆమెనే ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి అని పోలీసులు చెబుతున్నారు.

ఓ హోటల్‌లో న్యూ ఇయర్ పార్టీకి అటెండ్ అయ్యాక ఇంటికి తిరిగి వెళ్లుతుండగా ఆ హోటల్‌కు సమీపంలోనే రాత్రి సుమారు 1.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. 

click me!