రెండు రోజులు లాక్‌డౌన్ విధించండి..! ఇంట్లోనూ మాస్క్ ధరించే దుస్థితి.. సుప్రీంకోర్టు మండిపాటు

Published : Nov 13, 2021, 12:48 PM IST
రెండు రోజులు లాక్‌డౌన్ విధించండి..! ఇంట్లోనూ మాస్క్ ధరించే దుస్థితి.. సుప్రీంకోర్టు మండిపాటు

సారాంశం

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ఇంట్లోనూ మాస్కులు పెట్టుకునే పరిస్థితికి చేరుకున్నామని స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సోమవారం కల్లా కాలుష్య నియంత్రణకు ఎమర్జెన్సీ ప్లాన్‌తో రావాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. రెండు రోజులు లాక్‌డౌన్ విధిస్తారా.. ? అనే ఆలోచననూ ముందుంచారు.  

న్యూఢిల్లీ: దేశరాజధాని Delhi, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై సుమారు వారం రోజుల నుంచి వాయు కాలుష్యం దుప్పటి కప్పేసినట్టే ఉన్నది. Air Pollution తీవ్రతకు కొంత దూరంలోని వస్తువులేవీ కనిపించడం లేదు. దుమ్ము, దూళి, కలుషిత ఉద్గారాలు గాలిలో చేరి ఢిల్లీలో జీవించే పరిస్థితులను దుర్భరం చేస్తున్నాయి. ఇంటిలోనూ మాస్కులు ధరించే పరిస్థితికి చేరుకున్నామని స్వయంగా Supreme Court ప్రధాన న్యాయమూర్తే జస్టిస్ NV Ramana వాపోవడం దుస్థితికి అద్దం పడుతున్నది. కాలుష్య నియంత్రణకు సోమవారం కల్లా Emergency Planతో రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీజేఐ ఎన్వీ రమణ ఆదేశించారు. ‘ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంత తీవ్రతగా ఉన్నదో అర్థమవుతున్నదా?.. ఇంటిలోనూ మాస్కులు ధరిస్తున్నాం’ అని అన్నారు. ఢిల్లీలో రెండు రోజులు లాక్‌డౌన్ విధించే ఆలోచననూ చేయాలని సూచనలు చేశారు. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేస్తూ 17ఏళ్ల ఢిల్లీ స్టూడెంట్ ఆదిత్య దూబే పిటిషన్ వేశారు. దీన్ని సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారిస్తున్నది. ఈ పిటిషన్‌పై విచారిస్తూ ఢిల్లీలో వాయు ప్రమాణాలను పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటారో కేంద్ర ప్రభుత్వం తెలుపాలని సీజేఐ ఎన్వీ రమణ అడిగారు. ఎలాంటి ఎమర్జెన్సీ ప్రణాళికలు తీసుకుంటారని ప్రశ్నించారు. రెండు రోజుల లాక్‌డౌన్ విధిస్తారా? లేక ఏక్యూఐని తగ్గించడానికి ఏం ప్లాన్‌లు ఉన్నాయని అడిగారు.

Also Read: అక్కడ పీల్చే గాలి.. సిగరెట్ పొగ కంటే ప్రమాదకరం: ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా

ఢిల్లీ గాలిని పీల్చడమంటే.. రోజుకు 20 సిగరెట్లను తాగినట్టేనని, ప్రస్తుత దుస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ కాలుష్యానికి పంజాబ్‌లో పంట నష్టాలను కాల్చివేయడమే ప్రధానమైనట్టుగా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా అన్నారు. పంట నష్టాలను కాల్చడకుండా చర్యలు తీసుకుంటున్నామని, కానీ, గత ఐదారు రోజుల నుంచి మరీ ఎక్కువగా కాలుష్యం అక్కడి నుంచి వస్తున్నదని, పంజాబ్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం సరికాదని వాదించారు.

ఈ వాదనను ధర్మాసనం తప్పుపట్టింది. కాలుష్యానికి కేవలం రైతులే కారణమన్నట్టుగా చిత్రిస్తున్నారని, రైతులను విమర్శించడం ఇప్పుడో ఫ్యాషన్ అయిపోయిందని మండిపడింది. పంట నష్టాలే కాదు.. ఢిల్లీలో వాయు ఉద్గారాలు, దుమ్ము, దూళి వంటి అంశాలూ ఉన్నాయి. ఫైర్ క్రాకర్స్, ఇతర విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కాలుష్య నియంత్రణ కోసం చర్యలనే అడుగుతున్నామని, కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా.. అనే తారతమ్యం తమకు లేదని పేర్కొంది. రైతులే కారణమని తాము అనడం లేదని తుషార్ మెహెతా అన్నారు. కాలుష్య నియంత్రణకు అత్యవసర ప్రణాళికతో సోమవారం కోర్టుకు రావాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది.

Also Read: దీపావళి బాణసంచా ఎఫెక్ట్: ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి చేరిన వాయు కాలుష్యం

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యమున్నదని, ఇదే సమయంలో స్కూల్స్ కూడా ఓపెన్ చేశారని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. చిన్న పిల్లలను కాలుష్యానికి మనం ఎక్స్‌పోజ్ చేస్తున్నామని వివరించారు. ఇప్పుడు కొవిడ్, డెంగ్యూ, పొల్యూషన్ వంటి ప్రమాదాలున్నాయని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా వివరిస్తూనే ఉన్నాడని తెలిపారు. దీనిపై ఎలా స్పందిస్తున్నారని ప్రశ్నించారు. ఇది ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని అంశమే అని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu