Sandeshkhali: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి: రాష్ట్రపతికి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజ్ఞప్తి

By Mahesh KFirst Published Mar 5, 2024, 8:09 PM IST
Highlights

సందేశ్‌కాలి ఘటన గురించి వివరిస్తూ.. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని జాతీయ మహిళా కమిషన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అనేక హింసాత్మక ఘటనలు బెంగాల్‌లో చోటుచేసుకున్నాయని, కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఆరోపించారు.
 

Sandeshkhali Violence: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ మంగళవారం కలిశారు. పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సందేశ్‌కాలి హింసను వివరించారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.

నేషనల్ కమిషన్ ఫర్ విమెన్‌తో పాటు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వంటి పలు జాతీయ కమిషన్లు రాష్ట్రపతిని కలిశాయి. టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశాయి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మాట్లాడిన తర్వాత రేఖా శర్మ మీడియా ముందుకు వచ్చారు. ఇప్పటికీ సందేశ్‌కాలిలో దారుణ పరిస్థితులే ఉన్నాయని ఆమె తెలిపారు. ‘సందేశ్‌కాలి ఏదో ఒక చోట జరిగిన ఘటన కాదు. ఇదొక్కటే కాదు.. బెంగాల్‌లో అనేక చోట్ల ఇలాంటి హింసాత్మక ఘటనలు జరిగాయి. వాటిపై రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అందుకే పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్‌సీడబ్ల్యూ కోరింది’ అని ఆమె తెలిపారు. 

పశ్చిమ బెంగాల్‌లోని ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని రాష్ట్రపతి తెలిపారని రేఖా శర్మ వివరించారు. అక్కడి పరిస్థితులను తాను దగ్గరగా పరిశీలిస్తున్నట్టు చెప్పారని పేర్కొన్నారు.

click me!