నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు.. ప‌ది రాష్ట్రాల‌కు హెచ్చ‌రిక‌లు, ఢిల్లీలో మ‌ళ్లీ పెరిగిన చ‌లి

By Mahesh RajamoniFirst Published Jan 24, 2023, 12:16 PM IST
Highlights

New Delhi: దేశ రాజ‌ధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప‌రిధిలో మ‌ళ్లీ చలి తీవ్రత పెరిగింది. ఒక్క‌సారిగా మారిన వాతావ‌ర‌ణం కార‌ణంగా జనవరి 26 వరకు 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) వెల్ల‌డించింది. నేటి నుంచి మరో 4 రోజుల పాటు కొండ ప్రాంతాల‌ నుంచి మైదాన ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. 
 

Heavy rains for four days: ఉత్తర భారతంలో మంగ‌ళ‌వారం నుంచి మళ్లీ చ‌లి తీవ్ర‌త పెరిగింది. గ‌త మూడు రోజులుగా చ‌లి తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌గా, మరోసారి వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో చ‌లి తీవ్ర‌త పెర‌గ‌డంతో పాటు క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప‌రిధిలో మ‌ళ్లీ చలి తీవ్రత పెరిగిందని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఒక్క‌సారిగా మారిన వాతావ‌ర‌ణం కార‌ణంగా జనవరి 26 నాటికి 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ వెల్ల‌డించింది. నేటి నుంచి మరో 4 రోజుల పాటు కొండ ప్రాంతాల‌ నుంచి మైదాన ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. 

పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ల‌లో మంగ‌ళ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు మధ్య పర్వతాలలో వర్షం, హిమపాతం సంభవించవచ్చున‌ని ఐఎండీ తెలిపింది. దీనికి కార‌ణంగా  చలి తీవ్ర‌త‌ మరోసారి పెరుగుతుంద‌ని వెల్ల‌డించింది. జనవరి 26 వరకు రాజధాని ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేఘావృత‌మైన వాతావ‌ర‌ణంతో పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నందున గరిష్ఠ ఉష్ణోగ్రత పడిపోవడం ప్రారంభమవుతుందని ఐఎండీ తెలిపింది. 

వర్షం, హిమ‌పాతంతో త‌గ్గ‌నున్న ఉష్ణోగ్రతలు.. పెర‌గ‌నున్న చ‌లి

మంగళవారం రోజంతా ఢిల్లీ-ఎన్సీఆర్ లో మేఘావృతమైన వాతావ‌ర‌ణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉదయం, సాయంత్రం చిరుజల్లులు లేదా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలకు పడిపోతుంది. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగా ఉంటుందని తెలిపింది. ఈ నెల 26 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 22 నుండి 24 డిగ్రీలుగా ఉండ‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 10 నుండి 11 డిగ్రీల వరకు ఉంటుందని అంచ‌నా వేసింది. అదే సమయంలో జనవరి 25 నుంచి 29 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 20 నుంచి 23 డిగ్రీల వరకు ఉంటుందని తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 9 నుంచి 10 డిగ్రీల వరకు ఉండ‌వ‌చ్చున‌ని పేర్కొంది. 

పర్వత ప్రాంతాల్లో హిమపాతం.. పంజాబ్, హర్యానాలో వడగళ్ల వాన

జనవరి 24 నుంచి 26 వరకు హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు, హిమపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జనవరి 24, 25 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తుందని తెలిపింది. ఈ నెల 24 నుంచి 26 వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్ర‌దేశ్ ల‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ల‌లో జనవరి 24 నుంచి 25 వరకు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాజధానిలో కొన్ని చోట్ల వడగండ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంది.

దీని తరువాత, జనవరి 27 న మరొక పశ్చిమ అలజడి చురుకుగా ఉంటుంద‌నీ, దీని కారణంగా హిమాలయ ప్రాంతంలో మరోసారి భారీ వర్షాలు,  హిమపాతం ఉండవచ్చున‌ని ఐఎండీ అంచ‌నా వేసింది. అదే సమయంలో జనవరి 28, 29 తేదీల్లో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

యూపీలో పెర‌గ‌నున్న చ‌లి.. 

ఉత్తరప్రదేశ్ లో జనవరి 24న కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, జనవరి 25న కూడా వర్షాలు ప‌డే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షాల తర్వాత యూపీలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. బీహార్ లో ఈ వారం పగటిపూట ఎండలు ఉంటాయని, చలి నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. వీటితో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్ర చ‌లి ఉంటుంద‌ని ఐఎండీ రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

click me!