జ‌మ్మూకాశ్మీర్ లో పోటీకి సై.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పూర్తి శ‌క్తితో పోరాడతామని ఆప్ ప్రకటన

By Mahesh RajamoniFirst Published Jan 24, 2023, 10:51 AM IST
Highlights

Srinagar: జ‌మ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పూర్తి శక్తితో పోటీ చేస్తామని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయ‌క‌త్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. దేశ రాజకీయాల్లో వేగంగా ముందుకు వెళ్లేందుకు ఆప్ ప్రయత్నిస్తోందనీ, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం ఈ దిశగా ఒక ముందడుగుగా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.
 

AAP will contest in Jammu and Kashmir elections: జాతీయ రాజకీయాల్లో తన పాత్రను పెంచుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మ‌రో కీలక ప్రకటన చేసింది. జ‌మ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పూర్తి శక్తి, రాజకీయ శక్తితో ఎదుర్కొంటామని ఆప్ ప్రకటించింది. గత కొన్ని నెలల్లోనే పంజాబ్ లో అఖండ విజయం సాధించి, గుజరాత్ లో మంచి ఓట్లు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజకీయాల్లో వేగంగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తోందని, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం ఈ దిశగా ఒక ముందడుగుగా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే జాతీయ పార్టీ హోదాను ద‌క్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతూ దేశ ప్ర‌జ‌ల‌కు బీజేపీ, కాంగ్రెస్ ల‌కు ప్ర‌త్యామ్నాయ పార్టీగా ఎద‌గాల‌ని ఆప్ వ్యూహాలు ర‌చిస్తోంద‌ని తెలుస్తోంది. 

పంచాయతీ ఎన్నికల్లోనూ ఆప్ పోటీ కి సై.. 

ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్), ఆ పార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ సందీప్ పాఠక్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన ఆప్ సమావేశంలో జ‌మ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను పూర్తి శక్తితో ఎదుర్కోవాలని నిర్ణయించారు. అక్క‌డ కూడా పోటీ చేసి మ‌రింత దూకుడుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ఆప్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ సమావేశానికి ఇమ్రాన్ హుస్సేన్, ఆప్ జ‌మ్మూకాశ్మీర్ విభాగం నాయ‌కులు హాజరయ్యారు. జ‌మ్మూకాశ్మీర్ లో వచ్చే అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని రాజ్యసభ సభ్యుడు పాఠక్ తెలిపారు.

'వచ్చే ఎన్నికల్లో పూర్తి శక్తితో పోరాడతాం'

"జమ్మూకాశ్మీర్ లో వచ్చే అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలను పూర్తి బలంతో, రాజకీయ శక్తితో ఎదుర్కొంటాం. ప్రతి నగరం, గ్రామంలో పార్టీ పునాదిని బలోపేతం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయాలి" అని ఆయన ఆప్ జ‌మ్మూకాశ్మీర్ నాయకత్వాన్ని కోరారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఆప్ పనితీరు, నిర్మాణాత్మక అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వివిధ కమిటీల చైర్మన్లు, కో చైర్మన్లు, జమ్ముకశ్మీర్ యూనిట్ కు చెందిన అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

జ‌మ్మూకాశ్మీర్ లో పార్టీ విస్త‌ర‌ణ‌.. 

జ‌మ్మూకాశ్మీర్ లో పార్టీ కార్యకలాపాలు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చేసిన ప్రయత్నాలను స్థానిక‌ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం పాఠ‌క్ కు వివరించింది. జ‌మ్మూకాశ్మీర్ ఆప్ క్యాడర్ కీలక సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలపై చర్చించి ఖరారు చేసినట్లు పార్టీ తెలిపింది. 

ఇటీవల జాతీయ పార్టీగా అవతరించిన ఆప్.. 

ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఈ ప్రకటనతో జ‌మ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మరో జాతీయ పార్టీ పోటీ చేయబోతోంది. వాస్తవానికి ఇటీవల ఆప్ కు జాతీయ పార్టీ హోదా లభించడంతో దేశవ్యాప్తంగా ముందుకు వెళ్లాలన్న తన ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఇప్పుడు జ‌మ్మూకాశ్మీర్ లో ఆప్ ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా లేక సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందా అనేది చూడాలి.

click me!