ప్రధాని నరేంద్ర మోడీ (Prime minister narendra modi)పై పోటీ చేయాలని టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee)కు బీజేపీ (BJP)సవాల్ విసిరింది. ధైర్యం ఉంటే వారణాసి (Varanasi) నుంచి లోక్ సభకు పోటీ చేయాలని సూచించింది. అయితే దీనిపై ఇంకా దీదీ స్పందించలేదు.
పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి బీజేపీ సవాల్ విసిరింది. దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేయాలని కోరింది. 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ ఈ సవాల్ విసిరారు. వారణాసి లోక్ సభ స్థానం నుంచి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పారు.
‘‘మమతా బెనర్జీ వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్థానంలో పోటీ చేసే దమ్ము మమతా బెనర్జీకి ఉంటే ఆ పని చేయాలి. మీరు ప్రధాని కావాలనుకుంటున్నారు కదా? అప్పుడు ఆమె మన ప్రధానిపై పోటీ చేయాలి’’ అని అగ్నిమిత్ర పాల్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో అన్నారు.
2024 ఎన్నికలకు సీట్ల పంపకాలను ఖరారు చేయాలని బెంగాల్ ముఖ్యమంత్రి బీజేపీని కోరిన కొద్ది రోజులకే పాల్ ఈ విధంగా స్పందించారు. జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో ‘ఇండియా’ కూటమి సభ్యుల మధ్య ఉన్న విభేదాలను అగ్నిమిత్ర పాల్ ఎత్తిచూపారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి టీఎంసీలో చేరిన తర్వాత అధీర్ చౌదరి బాధిత కుటుంబాలపై స్పందించగలరా అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. ఇండియా కూటమిలో సీట్ల పంపకాలను వేగవంతం చేయాలని టీఎంసీ గత కొంత కాలంగా కోరుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సవాలు విసిరేందుకు మేనిఫెస్టోను ఖరారు చేయాలని తృణమూల్ ఉవ్విళ్లూరుతోంది. కాగా.. రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ నాయకులు వామపక్షాలతో సీట్ల సర్దుబాటు కోసం ఒత్తిడి తెస్తున్నారనే వార్తల నేపథ్యంలో.. మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ తో సీట్ల పంపకాల చర్చలకు సిద్ధంగా ఉన్నారని ‘ఎన్టీటీవీ’తో విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కాగా.. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును మమతా బెనర్జీ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యే ఒకరు ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని కూటమి ఓడిస్తే నితీశ్ కుమార్ ను ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ పట్టుబట్టారు.
మల్లిఖార్జున ఖర్గే గురించి ప్రజలకు తెలియదని, ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు అని కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. నితీష్ కుమార్ ఎవరో ప్రజలకు తెలుసని గోపాల్ మండల్ చెప్పారు. ఈ ప్రతిపాదనపై స్పందించేందుకు మల్లిఖార్జున ఖర్గే నిరాకరించారు.లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడమే తమ కూటమి ముందున్న తొలి కర్తవ్యమని అన్నారు.