కర్ణాటకలోని విద్యా సంస్థల్లో హిజాబ్ పై నిషేదాన్ని ఎత్తివేస్తూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ మండిపడింది. ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారని ఆరోపించింది.
కర్ణాటకలోని విద్యా సంస్థల్లో హిజాబ్ పై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో దానిపై వివాదం మళ్లీ మొదలైంది. 2022లో గత బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం పట్ల ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి మండిపడ్డారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేయడం వల్ల రాష్ట్రంలో షరియా చట్టం అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. అదే ప్రతిపక్షం అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తుందని అన్నారు. ‘‘ఇది కేవలం హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేయడమే కాదు. రాష్ట్రంలో షరియా చట్టాన్ని ఏర్పాటు చేయడం. దేశంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇస్లామిక్ చట్టాలు అమలవుతాయి. ఇది సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర’’ అని కేంద్ర మంత్రి మీడియాతో అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప కూడా స్పందించారు. ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకే సిద్ధరామయ్య హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రకటన చేశారని అన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎవరూ డిమాండ్ కూడా చేయలేదని అన్నారు. కాబట్టి సిద్ధ రామయ్య తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని చెప్పారు.విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేస్తూ సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయం మన విద్యా సంస్థల లౌకిక స్వభావంపై ఆందోళన కలిగిస్తోందని యడ్యూరప్ప కుమారుడు, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శించారు.
ప్రతిపక్ష ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించింది. చట్ట ప్రకారం ఈ చర్య జరుగుతోందని, ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని తెలిపింది. బీజేపీకి రాజ్యాంగంపై అవగాహన లేదని ఆరోపించారు. ‘‘వారు (బీజేపీ నాయకులు) రాజ్యాంగాన్ని చదవాలి. కర్ణాటక పురోగతికి పనికిరాని ఏ చట్టం లేదా విధానాన్ని ఉపేక్షించబోమం. అవసరమైతే ఆ చట్టాన్ని లేదా పాలనను తొలగిస్తాం’’ అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు.
ఈ విషయంపై సిద్ధరామయ్యతో చర్చించి ముందుకు తీసుకెళ్తానని రాష్ట్ర మంత్రి మధు బంగారప్ప తెలిపారు. దీనికి ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదన్నారు. సంస్కృతి, చదువులు తదితర అంశాలతో కూడిన రాష్ట్ర విద్యావిధానం ఉందన్నారు. తాము ఏం పురోగతి సాధించామో బీజేపీ మాట్లాడదన్నారు. మన ముఖ్యమంత్రి కచ్చితంగా ఇలాంటి విషయాలకు చట్టబద్ధత అంశాలను పరిశీలించి పరిశీలిస్తారని చెప్పారు.