కొవిడ్ చికిత్స నుంచి రెండు ఔషధాల తొలగింపు.. ఐసీఎంఆర్ కీలక మార్గదర్శకాలు

By Siva KodatiFirst Published Sep 24, 2021, 2:53 PM IST
Highlights

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) దేశంలో కొవిడ్ చికిత్సకు సంబంధించి తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాల జాబితా నుంచి ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ లను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) దేశంలో కొవిడ్ చికిత్సకు సంబంధించి తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాల జాబితా నుంచి ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ లను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ టాస్క్ ఫోర్స్ జాయింట్ మోనిటరింగ్ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది. పెద్దవాళ్లకు కొవిడ్ చికిత్స మార్గదర్శకాల సవరణలో ఈ రెండు ఔషధాలను ఇకపై వినియోగించరాదని తెలిపింది.

ఇక, రెమ్ డెసివిర్, టోసిలిజుమాబ్ ఔషధాలను మాత్రం ప్రత్యేకమైన సందర్భాల్లోనే వాడాలని స్పష్టం చేసింది. కొవిడ్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉన్న రోగులకు మాత్రమే రెమ్ డెసివిర్, టోసిలిజుమాబ్ ఔషధాలతో కూడిన చికిత్స అందించాలని ఐసీఎంఆర్ అనుబంధ విభాగం వెల్లడించింది. 

మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబీకులూ పరిహారం పొందడానికి అర్హులేనని కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ పరిహారం అందించే విషయాన్ని పున పరిశీలించాలని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సూచించిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు గురువారం ప్రమాణ పత్రం దాఖలు చేసింది.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ,ఐసీఎంఆర్ జారీ చేసిన మార్గ దర్శకాల ప్రకారం కోవిడ్ పాజిటివ్ అని తేలిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబసభ్యులూ రాష్ట్ర విపత్తు ప్రతి స్పందన నిధి కింద పరిహారం పొందడానికి అర్హూలేనని చెప్పారు. ఈ మేరకు కోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు అని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అదనపు ప్రమాణ పత్రంలో పేర్కొంది. ఇప్పటికే ఎస్ డీ ఆర్ఎఫ్ నుంచి కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించడానికి రాష్ట్రాలకు అనుమతించినట్లు కేంద్రం బుధవారం కోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఇది ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ వర్తించనుంది.
 

click me!