
తాను కల్కి దేవుడనని.. విష్ణుమూర్తి చివరి అవతారం అంటూ.. చెప్పుకుతిరిగే గుజరాత్ కి చెందిన ప్రభుత్వ మాజీ ఉద్యోగి రమేష్ చంద్ర ఫెఫర్.. మరోసారి వార్తల్లో నిలిచారు. తాను దేవుడనని చెప్పుకుంటూ.. ఆయన చాలా కాలం విధులకు హాజరుకాలేదు. దీంతో..ఆయన అకాల పదవీ విరమణ చేయాల్సి వచ్చింది.
కాగా.. తాజాగా ఆయన తన గ్రాట్యూటీని విడుదల చేయాలని.. లేకపోతే... తన దైవ శక్తులతో కరువు సృష్టిస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
చాలాకాలంగా అవతార పురుషుడినని చెప్పుకుంటూ తిరిగిన ఈయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తాజాగా ఆయన జల వనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాస్తూ, ప్రభుత్వం తన విషయంలో రాక్షసంగా వ్యవహరిస్తున్నదని, తనకు 16 లక్షల రూపాయల గ్రాట్యూటీతో పాటు ఒక ఏడాది జీతాన్ని నిలిపివేసి, తనను ఇబ్బందులపాలు చేస్తున్నదని ఆరోపించారు. దీనికి ప్రతీకారంగా తాను ఈ భూ మండలాన్ని కరువు కాటకాలతో మలమలమాడిపోయేలా చేస్తానని హెచ్చరించారు. తాను విష్ణువు అవతారమని, సత్యయుగాన్ని స్థాపించానని తెలిపారు. కాగా ఈ లేఖ అందుకున్న అధికారి మాట్లాడుతూ అతని గ్రాట్యుటీ చెల్లింపుల ప్రక్రియ జరుగుతున్నదని తెలిపారు.