
బెంగుళూరు: కర్ణాటక సీఎం ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ చెప్పారు. అయితే తన గురువును కలిసిన తర్వాతే తాను ఢిల్లీ వెళ్లనున్నట్టుగా డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
సోమవారంనాడు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ బెంగుళూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు సరైన నిర్ణయం తీసుకుంటారని తాను భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు తాను ఎంతో కష్టపడినట్టుగా చెప్పారు. కర్ణాటక పీసీసీ చీఫ్ గా పార్టీ గెలుపు కోసం శ్రమించానన్నారు. రాష్ట్రంలో పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చినట్టుగా డీకే శివకుమార్ గుర్తు చేశారు. తన నేతృత్వంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారన్నారు. తాను ఒంటరిగానే పార్టీని గెలిపించుకున్నానని డీకే శివకుమార్ చెప్పారు. తాను వన్ మ్యాన్ ఆర్మీగా డీకే శివకుమార్ ప్రకటించుకున్నారు. తాను ఒంటరినని చెప్పారు. ఒంటరిగానే పోరాటం చేస్తానన్నారు. గతంలో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా కూడా తాను ఏనాడూ ధైర్యం వీడలేదన్నారు
also read:న్యూఢిల్లీకి చేరిన సిద్దరామయ్య: డీకే శివకుమార్ హస్తిన టూర్ పై సస్పెన్స్
తన బర్త్ డే వేడుకల్లో సిద్దరామయ్య కూడా పాల్గొన్నారన్నారు.సిద్దరామయ్యతో తనకు ఎలాంటి విబేధాలు లేవన్నారు. . తనకంటూ ఉన్న మద్దతుదారుల సంఖ్యను తాను చెప్పలేనన్నారు. .తన మద్దతుదారుల విషయం పార్టీ అధిష్టానానికి తెలుసునని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ గురించి బీజేపీ ప్రచారం చేసినా కూడా కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారన్నారు. తన గురువును కలిసిన తర్వాత కుటుంబ సభ్యులతో ప్రైవేట్ పార్టీ ఉందని డీకే శివకుమార్ చెప్పారు. ఈ పార్టీ తర్వాత తాను ఢిల్లీకి బయలుదేరుతానన్నారు.