స్వాతంత్ర్య సమరంలో పరదా సంప్రదాయాన్ని పక్కనపెట్టిన నిశత్ ఉన్నీసా బేగం గురించి తెలుసా?

Published : May 15, 2023, 04:17 PM ISTUpdated : May 15, 2023, 04:19 PM IST
స్వాతంత్ర్య సమరంలో పరదా సంప్రదాయాన్ని పక్కనపెట్టిన నిశత్ ఉన్నీసా బేగం గురించి తెలుసా?

సారాంశం

దేశ స్వాతంత్ర్య సమరం జరుగుతున్న సమయంలో పరదా సంప్రదాయాన్ని పక్కనపెట్టే సాహసోపేత నిర్ణయం తీసుకున్న నిశత్ ఉన్నీసా బేగం గురించి చరిత్రలో ఎక్కువగా కనిపించదు. కానీ, ఆమె రాజకీయ కార్యకలాపాలు ఆ సమరంలో ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. కానీ, ఇతర మహిళల లాగే.. ఆమెకూ చరిత్రకారులు ఎక్కువ ప్రాధాన్యమివ్వలేదు. ఆమెను కేవలం భర్త హస్రత్‌కు సహాయకారిగా మాత్రమే చూపారు.  

‘ఈ దేవత ముందు దేశ యువత మోకరిల్లి స్వాతంత్ర్యం, పట్టుదలపై పాఠాలు నేర్చుకోవాలని నేను అప్పీల్ చేస్తున్నా..’ అని ప్రముఖ భారత రచయిత బ్రిజ్ నారాయణ్ చక్‌బస్త్ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు నిశత్ ఉన్నీసా బేగం గురించి 1918లో రాశారు.

ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని తొలిసారి ఇచ్చిన నిశత్ ఉన్నీసా బేగం భర్త మౌలానా హస్రత్ మొహానీ గురించి ప్రజలకు తెలుసు. కానీ, నిశత్ ఉన్నీసా బేగం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇతర మహిళలు ఎదుర్కొన్న వివక్షనే ఆమె ఎదుర్కొంది. అందుకే చరిత్రకారులు ఆమె గురించి పెద్దగా రాయలేదు. ఆమె స్వతంత్రంగా పోరాడే శివంగి.. కానీ, ఆమెను భర్తకు సహాయకురాలిగా మాత్రమే పరిమితం చేశారు. నిజానికి ఆమె భర్త హస్రత్ ఆమె గురించి స్వయంగా వెల్లడించినా ఆమె పేరు చరిత్రలో పెద్దగా నమోదు కాలేదు. పట్టుదల, ఓపికల పర్వతం ఆమె అని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆమెను ప్రశంసించారు. సహాయ నిరాకరణోద్యమంలో ఆమె పాత్రను మహాత్మా గాంధీ కూడా గుర్తించారు. 

1885లో లక్నోలో జన్మించిన ఆమె అప్పటి సంప్రదాయం ప్రకారమే ఇంటి వద్దే ట్యూషన్ పెట్టుకుని నేర్చుకుంది. ఆమెకు ఉర్దూ, అరబిక్, పర్షియన్, ఇంగ్లీష్ భాషల్లో పరిజ్ఞానం ఉన్నది. 1901లో హస్రత్‌ను పెళ్లి చేసుకోకముందే ఆమె సమాజంలో వెనుకబడిన మహిళలకు, ఆడ పిల్లలకు చదువు చెప్పుతూ ఉంది. పెళ్లి ఆమెకు దేశ రాజకీయాలను పరిచయం చేసింది.

బాల గంగాధర్ తిలక్ అతివాద గ్రూపులో చేరిన తొలి తరం ముస్లింలలో నిశత్, హస్రత్‌లు ఉంటారు. అలీగడ్‌లో స్వదేశీ షాప్ ఓపెన్ చేశారు. 1903లో ఈ దంపతులు జాతీయవాద ఉర్దూ న్యూస్ పేపర్ ‘ఉర్దూ ఎ మౌల్లా’ను ప్రారంభించారు. అనతికాలంలోనే బ్రిటీష్‌వారికి కంటగింపుగా మారింది. 1908లో హస్రత్‌ను జైలుకు పంపించారు. ఆయన విడుదల తర్వాత ఆ దంపతులు మళ్లీ పత్రికను నడిపారు. ఆ పత్రికలో ఉద్యోగులు ఇద్దరే. వారు.. నిశత్, హస్రత్.

తొలి ప్రపంచ యుద్ధ కాలంలో హస్రత్‌ను ఆంగ్లేయులు మరోసారి జైలుకు పంపారు. ఆ సమయంలో నిశత్ కూడా ఇతర ముస్లిం మహిళల్లాగే ముఖాన్ని పరదాలు, తెరలతో కప్పుకునేది. కోర్టులో భర్తను సమర్థించుకోవడానికి ఆమె ఇలాగే వెళ్లేది. భర్త గురించి నేతలకు లేఖలు రాసింది. పత్రికల్లో వ్యాసాలు రాసింది. ఆ తర్వాత కోర్టులకు వెళ్లేటప్పుడు పరదా సంప్రదాయాన్ని తొలగించి ముఖానికి అడ్డమేమీ పెట్టుకునేది కాదు. ఆ కాలంలో అది ఎంతో సాహసోపేతమైన చర్య.

హస్రత్ మిత్రుడు పండిత్ కిషన్ పర్షద్ కౌల్ ఆమె గురించి ఇలా రాశారు. పరదా అనేది ముస్లింలలోనే కాదు.. హిందూ మహిళల్లోనూ ఒక మర్యాదపూర్వకమైన గుర్తుగా ఉన్న కాలంలో నిశత్ దాన్ని తొలగించే సాహసోపేత నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. జైలు పాలైన స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ విరాళాలు సేకరించి ఇచ్చేది. ఆ విరాళాలనూ నిశత్ తిరస్కరించింది. 1917లో పండిత్ కిషన్ పర్షద్ అలీగడ్‌లో ఆమె వద్దకు వెళ్లినప్పుడు కటిక పేదరికం అనుభవిస్తూ ఉన్నదని పేర్కొన్నారు. డబ్బులు ఆఫర్ చేస్తే తిరస్కరించిందని తెలిపారు. తనకు ఉన్నదానితో చాలా సంతోషంగా ఉన్నానని ఆమె బదులిచ్చిందని వివరించారు. ఆమె ప్రింట్ చేసిన ఉర్దు పుస్తకాల విక్రయంలో సహకరిస్తారా? అని తర్వాత అడిగినట్టు తెలిపారు.

ఇదే విషయాన్ని మరో ఫ్రీడమ్ ఫైటర్ శివ ప్రసాద్ గుప్తాకు తెలియజేయగా.. ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెక్ రాసి అన్ని పుస్తకాలు కొన్నాడు.

ఎడ్విన్ మొంటాగు 1017లో భారత్ పర్యటించినప్పుడు ఆయనను కలవడానికి ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ ప్రతినిధుల్లో నిశత్ కూడా ఉన్నారు. ఫ్రీడమ్ ఫైటర్లు అందరినీ జైళ్ల నుంచి విడుదల చేయాలని ఆమె అప్పుడు డిమాండ్ చేశారు. జలియన్ వాలా బాగ్ మారణహోమం తర్వాత అమృత్‌సర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సెషన్‌కూ ఆమె హాజరై నిశత్ తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. పరదా లేకుండా భర్తతో సమానంగా రాజకీయాల్లో ఆమె పాల్గొనడం అప్పుడు సంచలనంగా ఉండేది. ఆమెను హస్రత్ కామ్రేడ్ అని పిలుచుకునేవారు.

1922లో హస్రత్ మరోసారి జైలుకు వెళ్లినప్పుడు నిశత్ గయాలో నిర్వహించిన కాంగ్రెస్ సెషన్‌లో పాల్గొని మాట్లాడింది. సంపూర్ణ స్వరాజ్యం  కావాలనుకునేవారు ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన అసెంబ్లీల్లోకి వెళ్లే ఆలోచనలు విరమించుకోవాలని సూచించింది.

నిశత్ రాజకీయాలు కేవలం హస్రత్ పైనే ఆధారపడి లేవని ప్రొఫెసర్ అబిదా సమీయుద్దీన్ అంటారు. కాంగ్రెస్ సెషన్‌లో మాట్లాడిన తొలి ముస్లిం మహిళ ఆమెనే అని వివరించారు. స్వదేశీ, ఆల్ ఇండియా విమెన్ కాన్ఫరెన్స్‌లను ప్రచారం చేయడానికి పాటుపడ్డారు. వార్తాపత్రికల్లో వ్యాసాలు, బహిరంగ ప్రసంగాలు, ఇతర రాజకీయ కార్యకలాపాలను చూస్తే ఆమె భారత స్వాతంత్ర్య సమరంలో తనదైన ముద్ర వేశారని అర్థం అవుతుంది. 1937లో ఆమె మరణించే వరకు వర్కర్స్ మూవ్‌మెంట్‌లో క్రియాశీలకంగా ఉన్నారు.

--సాకిబ్ సలీం

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu