కొత్త పార్లమెంటు నిర్మించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు: శరద్ పవార్

By Mahesh KFirst Published Jun 6, 2023, 9:42 PM IST
Highlights

కొత్త పార్లమెంటు నిర్మించాల్సిన అవసరం ఏమిటో తనకు అర్థం కాదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్  అన్నారు. పార్లమెంటు సంబంధిత వ్యవహారాలపై చర్చ చేయాలని, కానీ, రాను రాను ఈ సంప్రదాయం క్షీణిస్తున్నదని తెలిపారు.
 

ఔరంగాబాద్: పార్లమెంటు సంబంధ వ్యవహారాలపై చర్చ చాలా ముఖ్యమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శరద్ పవార్ మంగళవారం పేర్కొన్నారు. నూతన పార్లమెంటు భవనం గురించి రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది అని అన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మహాత్మా గాంధీ మిషన్ యూనివర్సిటీలో నిర్వహించిన సౌహార్ద్ బైఠక్‌లో శరద్ పవార్ మాట్లాడారు.

పార్లమెంటు వ్యవహారాల గురించి చర్చ చేయడం రాను రాను తగ్గిపోతున్నదని శరద్ పవార్ అన్నారు. రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు సహజం అని, అయినా.. చర్చించి వాటిని ఏకాభిప్రాయం మీదికి తీసుకురావాలని వివరించారు. గతంలోనూ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు జరిగేవని తెలిపారు.

అసలు నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఏమిటో తనకు అర్థం కాదని అన్నారు. దీనికి సంబంధించిన నిర్ణయం రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి తీసుకోవాల్సింది అని వివరించారు. తనకు ఈ విషయం న్యూస్ పేపర్ల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు.

ఆ నూతన పార్లమెంటు భవనాన్ని మే 28వ తేదీన ప్రారంభించారు. కాంగ్రెస్ దీన్ని పట్టాభిషేకంగా పేర్కొంటూ ప్రధాని మోడీపై విమర్శలు సంధించింది.

Also Read: అది దేశానికి చీకటి రోజు.. మేం రోడ్లపై, నిందితుడు పార్లమెంటులో.. : రెజ్లర్ బజరంగ్ పునియా సంచలన వ్యాఖ్యలు

పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించాలని తాము డిమాండ్ చేశామని శరద్ పవార్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాల్సిన అవసరమే లేదని తెలిపారు. పార్లమెంటు తొలి సమావేశం జరిగిన తర్వాత దిగిన ఓ ఫోటో వైరల్ అయిందని, అందులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సహా పలువురు నేతలు ఉన్నారని వివరించారు. అదే నూతన పార్లమెంటు ప్రారంభం తర్వాత బయటకు వచ్చిన ఫొటోలో కాషాయ దుస్తులు ధరించిన వారు ఉన్నారని తెలిపారు. ఎన్నికైన నేతలకు నూతన పార్లమెంటు భవనంలోకి తొలిగా ప్రవేశానికి అవకాశాలు ఇవ్వలేదని వివరించారు.

click me!