
దేశం కోసం తాను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బుధవారం ఆయన ఇంటిపై బీజేపీ కారకర్తలు దాడి చేసిన ఒక రోజు తరువాత ఆయన స్పందించారు. గురువారం ఆయన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ ఘటనపై మాట్లాడారు. దేశంలోని అతిపెద్ద పార్టీ గూండాయిజానికి పాల్పడటం ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపడమే అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం పురోగమించదని బీజేపీపై మండిపడ్డారు.
“ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యం కాదు. దేశం ముఖ్యం. నేను దేశం కోసం నా ప్రాణాలను అర్పించగలను. ఇలాంటి గూండాయిజంతో భారతదేశం పురోగమించదు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి దేశంలోనే అతి పెద్ద పార్టీ ఇలాంటి గూండాయిజానికి పాల్పడి ప్రజల్లో చెడు సందేశాన్ని పంపుతోంది. ప్రజలు ఇదే సరైన మార్గం (దేనినైనా ఎదుర్కోవటానికి) అని అనుకుంటారు ” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ పోరాటంలో ఇప్పటికే 75 ఏళ్లు వృథా చేశామని చెప్పారు. దేశమే ముఖ్యం. అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కేజ్రీవాల్ తెలిపారు.
బుధవారం కేజ్రీవాల్ నివాసంలో జరిగిన విధ్వంసానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఇందులో ప్రమేయం ఉన్న మరింత మందిని అరెస్టుల చేసేందుకు పోలీసులు బృందాలు పని చేస్తున్నాయి. కావున ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని పీటీఐ తెలిపింది.
'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రంపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం బీజేపీ యువజన విభాగం సభ్యులు కేజ్రీవాల్ నివాసం బయట వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
ఇటీవల ఢిల్లీ అసెంబ్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కాశ్మీరీ పండిట్ల ఊచకోత అబద్ధమని పేర్కొన్నారు. ద కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రచారం చేస్తున్న బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ సినిమాపై వచ్చిన లాభాలను కాశ్మీర్ పండిట్ల కోసం ఖర్చు చేయాలని సూచించారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు ట్యాక్స్ ఎందుకు మినహాయించడం అని, య్యూటూబ్ లో పెడితే దేశ ప్రజలందరూ ఉచితంగా చూస్తారని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ఈ విధ్వంసం జరిగింది.
కాగా పంజాబ్ ఎన్నికల్లో ఓటమి పాలైనందుకే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను చంపాలని చూస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా ఆరోపించారు. కాశ్మీర్ పండిట్ల కోసం అరవింద్ కేజ్రీవాల్ చాలా చేశారని చెప్పారు. సరైన డాక్యుమెంట్లు లేకపోయిన టీచర్లను పర్మినెంట్ చేశారని చెప్పారు. ఇదిలా ఉండగా బుధవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంపై జరిగిన దాడిపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ దాడిపై స్వతంత్ర, న్యాయమైన, కాలపరిమితితో కూడిన నేర విచారణను చేపట్టాలని, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేయాలని సౌరభ్ భరద్వాజ్ విజ్ఞప్తి చేశారు.