భారతదేశంలో నీలి విప్లవం గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. ?

By Sumanth KanukulaFirst Published Aug 6, 2022, 7:29 PM IST
Highlights

నీలి విప్లవం ద్వారా భారతదేశంలో ఆక్వాకల్చర్ రంగాలలో వేగవంతమైన వృద్ది సాధ్యమైందనే చెప్పాలి. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్య సంపదతో ముడిపడి ఉన్న రైతుల ఆదాయాన్ని పెంచడానికి నీలి విప్లవం ప్రారంభించబడింది.

నీలి విప్లవం ద్వారా భారతదేశంలో ఆక్వాకల్చర్ రంగాలలో వేగవంతమైన వృద్ది సాధ్యమైందనే చెప్పాలి. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్య సంపదతో ముడిపడి ఉన్న రైతుల ఆదాయాన్ని పెంచడానికి నీలి విప్లవం ప్రారంభించబడింది. అసలు భారత దేశంలో నీలి విప్లవం ఎలా ప్రారంభమైంది?, ఆర్థికంగా ఎలాంటి వృద్ది సాధించింది.. వంటి కీలక విషయాలని ఒకసారి చూద్దాం. 1985-1990 మధ్య కాలంలో సముద్ర, ఆక్వాకల్చర్ పరిశ్రమ అభివృద్ధిని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం చొరవ తీసుకుంది. నీల్ క్రాంతి మిషన్‌గా ప్రసిద్ధి చెందిన నీలి విప్లవం.. 1985లో డాక్టర్ హీరాలాల్ చౌదరి, డాక్టర్ అరుణ్ కృష్ణన్‌లచేత ప్రారంభించిబడిన గొప్ప కార్యక్రమం. వీరిద్దరూ కూడా నీలి విప్లవ పితామహూలుగా ప్రసిద్ధి చెందారు. 

అయితే, భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత, మన దేశం సముద్ర మరియు ఆక్వాకల్చర్ రంగాలలో వేగవంతమైన వృద్ధిని సాధించింది. అలాగే, ఈ నీలి విప్లవాన్ని ప్రారంభించడం వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం.. స్వయం సమృద్ధిగల ఆర్థిక వ్యవస్థను నిర్మించడం. అలాగే సుస్థిరత, జీవ భద్రతలో శ్రేయస్సును లక్ష్యంగా చేసుకోవడం. నీలి విప్లవం యొక్క ప్రధాన భావనలు మరియు దాని భారీ విజయానికి గల కారణాన్ని అర్థం చేసుకోవడానికి దిగువ కథనాన్ని చదవండి.

ఫిష్ ఫార్మర్స్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ క్రింద 1985-1990లో ఏడవ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టిన సమయంలో ఈ పథకాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ నీలి విప్లవాన్ని ప్రారంభించడం వెనుక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం.. స్వయం సమృద్ధిగల ఆర్థిక వ్యవస్థను నిర్మించడం. అయితే అప్పటికే ఆక్వాకల్చర్ పరిశ్రమకు సంబంధించిన అనేక పథకాలు కొనసాగుతున్నాయి. దీంతో కొనసాగుతున్న ఆ కార్యక్రమాలన్నింటినీ Blue Revolution పథకం కింద విలీనం చేసింది. 

అప్పటి నుంచి మత్య్స పరిశ్రమలో నూతన ఉత్తేజం కనిపించడం మొదలైంది. ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక సమయంలో ఇంటెన్సివ్ మెరైన్ ఫిషరీస్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది. ఇందులో MNCల సహకారం ప్రోత్సహించబడింది. కాలక్రమేణా.. టుటికోరిన్, పోర్, విశాఖపట్నం, కొచ్చి, పోర్ట్ బ్లెయిర్లలో ఫిషింగ్ హార్బర్లు స్థాపించబడ్డాయి. ఉత్పత్తిని పెంచడానికి అలాగే జాతులను మెరుగుపరచడానికి అనేక పరిశోధనా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఎఫ్ఎఫ్‌డీఏ చేపల పెంపకం, మార్కెటింగ్, ఎగుమతి వంటి కొత్త పద్ధతులను అనుసరించడం ద్వారా ఆక్వాకల్చర్‌లో మెరుగుదల తెచ్చింది.

ఆ తర్వాత కూడా ఈ రంగంపై ప్రభుత్వాలు దృష్టిని కేంద్రీకరించాయి. దీంతో కొన్నేళ్లలోనే భారత దేశంలో చేపల ఉత్పత్తి భారీగా పెరిగింది. భారతదేశంలోని అనేక వర్గాలకు చేపలు పట్టడం ప్రధాన జీవనాధారంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇది అలాంటి వారికి ఉపాధి కల్పించడమే.. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పాటు అందించిందనే చెప్పాలి. మూడేళ్ల కిందటి గణంకాలను కూడా పరిశీలిస్తే.. 50 సంవత్సరాల క్రితం కేవలం 60,000 టన్నుల చేపలను ఉత్పత్తి చేసిన భారతీయ మత్స్య రంగం.. 4.7 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసే స్థాయికి చేరింది. ఇందులో మంచినీటి ఆక్వాకల్చర్ నుంచి ఉత్పత్తి చేసే చేపలు 1.6 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. భారతదేశం గత దశాబ్దంలో చేపలు, చేపల ఉత్పత్తుల ఉత్పత్తిలో 14.8 శాతం సగటు వార్షిక వృద్ధిని నమోదు చేసింది. అదే కాలంలో ప్రపంచ సగటు 7.5 శాతంగా ఉంది. ఇక, భారత ఆర్థిక వ్యవస్థకు నీలి విప్లవం ఒక వరంలా మారిందనే చెప్పాలి. ఇది ఫిషింగ్, ఆక్వామెరైన్ పరిశ్రమ మరింత స్వీయ-స్థిరత సాధించడానికి ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించడంలో సహాయపడింది.

click me!