పాకిస్తాన్ టాప్ పోస్టుల్లో హిందూ మహిళలు.. సివిల్ సర్వెంట్, డీఎస్పీ బాధ్యతలు

By telugu teamFirst Published Sep 21, 2021, 12:37 PM IST
Highlights

పాకిస్తాన్‌ టాప్ ఉద్యోగాల్లో హిందూ మహిళలు హవా ప్రదర్శిస్తున్నారు. తాజాగా, సివిల్ సర్వెంట్ పోస్టుకు క్వాలిఫై అయిన డాక్టర్ సనా రామచంద్ గుల్వాని తొలి హిందూ మహిళా సివిల్ సర్వెంట్‌గా రికార్డు నెలకొల్పారు. ఇదే ఏడాది 26ఏళ్ల మనీషా రొపేతా తొలి మహిళా డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు.
 

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో హిందు కుటుంబాలు అనేక అణచివేతలు, నిర్బంధాల మధ్య జీవిస్తున్నారని అప్పుడప్పుడు వార్తా కథనాలు వెల్లడిస్తుంటాయి. మిగతా వారికంటే చాలా తక్కువ సదుపాయాలు, స్వేచ్ఛ వీరికి లభిస్తాయన్న వాదనలూ ఉన్నాయి. అయినప్పటికీ అలాంటి దుర్బర పరిస్థితులను ఎదుర్కొని ఇద్దరు హిందూ మహిళలు పాకిస్తాన్‌లో సంచలనం సృష్టించారు. ఆ దేశంలోని అత్యంత క్లిష్టమైన పరీక్షగా భావించే పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌(పీఏఎస్) క్లియర్ చేసి రికార్డు బద్ధలు కొట్టారు. పాకిస్తాన్‌లో తొలి హిందూ మహిళా సివిల్ సర్వెంట్‌గా డాక్టర్ సనా రామచంద్ గుల్వాని నిలవనున్నారు. ఇదే ఏడాదిలో 26ఏళ్ల మనీషా రొపేతా ప్రొవిన్షియల్ పరీక్షలు పాస్ అయి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా బాధ్యతలు తీసుకున్నారు.

పాకిస్తాన్‌లోని హిందూ యువతి డాక్టర్ సనా రామచంద్ గుల్వాని ఇప్పుడు సంచలనానికి కేరాఫ్‌గా మారారు. సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్(సీఎస్ఎస్) క్లియర్ చేసి పీఏఎస్ సింధ్ రూరల్ సీట్‌ను సొంతం చేసుకున్నారు. మనదేశంలో సివిల్స్ పరీక్షలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ తరహాలోనే పాకిస్తాన్‌లో సీపీఎస్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో డాక్టర్ సనా రామచంద్ గుల్వాని ప్రతిభ కనబరిచారు.

తొలుత ఆమె మెడికల్ ప్రొఫెషన్‌ వైపు వెళ్లారు. షహీద్ మొహతర్మ బెనజీర్ బుట్టో మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ డిగ్రీ పొందారు. యురాలజిస్ట్‌గా పనిచేశారు. అయితే, సివిల్ సర్వీస్‌వైపు మారడానికి దోహదపడిన కారణాలను సనా రామచంద్ గుల్వాని వివరించారు.

‘నా ట్రెయినింగ్ మొదలైనప్పుడు శిఖార్‌పూర్ జిల్లాలో మెడికల్ ఆఫీసర్‌గా పోస్ట్ చేశారు. అక్కడ ప్రభుత్వ హాస్పిటల్‌లలో సదుపాయాలు దుర్భరంగా ఉండేవి. కనీస సౌకర్యాలు ఉండేవి కావు. ఓ సారి శిఖార్‌పూర్ డిప్యూటీ కమిషనర్ అక్కడికి వచ్చినప్పుడు చాలా మంది డిప్యూటీ కమిషనర్‌ను గౌరవించడాన్ని గమనించాను. హాస్పిటల్‌లోని లోపాలను ఆయన సూచనల మేరకు అధిగమించడానికి అందరూ సిద్ధమయ్యారు. అదే నన్ను సివిల్ సర్వెంట్ వైపు అడుగులు వేయడానికి దోహదం చేసింది’ అని తెలిపారు.

పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహించిన సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ర్యాంక్ కొట్టిన మరో హిందు యువతి మనీషా రొపేతా రికార్డ్ నెలకొల్పారు. తద్వార తొలి హిందూ మహిళా డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు.

click me!