
ఇటీవల ముగిసిన అస్సాం మున్సిపల్ ఎన్నికల (Assam Municipal election) ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. గతవారం 80 మున్సిపల్ బోర్డుల్లోని 920 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 57 వార్డుల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అక్కడ ఎన్నికలు జరగలేదు. మిగిలిన స్థానాల కోసం మొత్తం 2,532 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
ప్రస్తుతం వరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం బీజేపీ (bjp) 296 వార్డుల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ (congress) 33 వార్డుల్లో, ఇతర పార్టీలు 62 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. సాయంత్రం వరకు ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అస్సాంలో పౌర ఎన్నికలకు బ్యాలెట్ పేపర్‌కు బదులుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (EVM) ఉపయోగించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలను జిల్లా, సబ్ డివిజన్ హెడ్‌క్వార్టర్స్‌లోని స్ట్రాంగ్ రూమ్ (Strong room)లకు సురక్షితంగా తరలించారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి కూడా రీపోలింగ్ కోసం అభ్యర్థన రాలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (state election commission) ఒక ప్రకటనలో తెలిపింది.
అస్సాం మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 16,73,899 మంది ఓటు వేసేందుకు అర్హులుగా తేలారు. ఇందులో 8,41,534 మంది మహిళలు, 17 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల కోసం అధికార బీజేపీ (bjp) 825 మంది అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ (congress) తరఫున 706 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసోం గణ పరిషత్ (Asom Gana Parishad) తరుఫున 243 మంది పోటీలో నిలబడ్డారు. అస్సాం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 70 శాతం ఓటింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.