
ఉత్తరప్రదేశ్ : తన పిల్లలు ఆపదలో ఉంటే తల్లి యముడితోనైనా పోరాడుతుంది. దీనికి నిదర్శనమే ఈ ఘటన. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో తన పదేళ్ల కొడుకును కాపాడుకోవడానికి ఏకంగా చిరుతపులితో యుద్ధం చేసింది ఓ తల్లి. ఆమె రోజువారీ కూలీ పనిచేసుకునే 34 ఏళ్ల మహిళ. ఆ రోజు చెరకు తోటలో పని చేస్తున్నప్పుడు తన పదేళ్ల కొడుకు మీద చిరుతపులి దాడి చేసింది. వెంటనే గమనించిన ఆమె దానితో పోరాడి కొడుకును రక్షించింది.
సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోని ఎన్‌హెచ్ 74కి సమీపంలో ఉన్న జీత్‌పూర్ గ్రామంలో శాంతరేష్ దేవి అనే మహిళ చెరుకుతోటలో పని చేస్తుండగా, చిన్నారి కొంత దూరంలో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది. అకస్మాత్తుగా, చిరుతపులి అక్కడికి వచ్చి.. ఆమె కుమారుడు టికేంద్ర సైనీపై దాడి చేసింది.
అతని కేకలు విన్న, ఆమె మొదట దాన్ని తీవ్రంగా తిట్టింది.. తరువాత దానిని భయపెట్టడానికి తన కొడవలి ఝుళిపించింది. ఈ క్రమంలో భయాన్ని దరిచేరనివ్వలేదు. కొడవలి చేత్తో పట్టుకుని చిరుతపులిని భయపెట్టడం కొనసాగించింది. కాసేపటికి చిరుతపులి పిల్లవాడిని విడిచిపెట్టి పారిపోయింది. అయితే, చిరుత దాడి చూసిన పొలంలో పనిచేస్తున్న మిగతావారు ఎప్పుడో పలాయనం చిత్తగించారు.
మహిళ సాహసంతో పులి పారిపోయాక..తీవ్ర గాయాలపాలైన కొడుకును తీసుకుని ఆమె ఒంటరిగా పొలం నుండి బయటకు తీసుకువచ్చింది. ఈ ఘటనలో దేవికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆమె కొడుకు టికేంద్ర తల, చేతులు, కడుపు, మెడపై లోతైన గాయాలయ్యాయి. దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
పులి పారిపోవడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. బాలుడిని నగినాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. నగీనా హెల్త్ కేర్ సెంటర్ సెంటర్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ నవీన్ చౌహాన్ మాట్లాడుతూ, "బాలుడి తల, మెడ, కడుపులో గాయాలు ఉన్నాయి, అతని పరిస్థితి విషమంగా ఉన్నందున, అతన్ని బిజ్నోర్ జిల్లా ఆసుపత్రికి తరలించి, అక్కడ నుండి చికిత్స కోసం రిషికేశ్ ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు" అని చెప్పారు.
గాయపడిన వారికి ప్రభుత్వ పథకాల కింద నష్టపరిహారం అందజేస్తామని, మా బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని, రైతులు తమ పొలాల్లో పని చేసేటపుడు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని బిజ్నోర్‌లోని నాగిన రేంజ్‌కు చెందిన ఫారెస్ట్ రేంజర్ కుమార్ విజ్ఞప్తి చేశారు. బిజ్నోర్‌లోని రైతులు 'చెరుకు చిరుతపులి' భయంతో జీవిస్తున్నారు. తమ పంటలను కాపాడుకునేందుకు వందలాది మంది రైతులు తమ పొలాల్లో క్యాంపులు వేయడంతో మానవ-జంతు సంఘర్షణ కేసులు కూడా పెరిగాయి.
చిరుతపులి సంతానోత్పత్తి కాలం ఫిబ్రవరి-మేలో ఉంటుంది. దీంతో నెలకు 20 సార్లు పులులు కనిపిస్తున్నాయని ఒక అంచనా. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో గత నెల రోజులుగా డజనుకు పైగా పులులు కనిపించాయన్న కేసులు నమోదయ్యాయి.