Raipur Helicopter Crash: ల్యాండింగ్ సమయంలో కుప్ప‌ కూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల మృతి

By Rajesh KFirst Published May 12, 2022, 11:30 PM IST
Highlights

Raipur Helicopter Crash: రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించారు. గురువారం రాత్రి 9.10 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో రన్‌వే చివరి భాగంలో కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
 

Raipur Helicopter Crash: ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో కూలింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు పైలట్లు చనిపోయారు. ప్రమాదం తర్వాత విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. ప్రమాదాన్ని రాయ్‌పూర్ పోలీసులు ధృవీకరించారు. ప్రమాదంపై సీఎం భూపేష్ బఘెల్ కూడా విచారం వ్యక్తం చేశారు.

 రాత్రి 9.10 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. రన్‌వే చివర్లో అగస్టా హెలికాప్టర్ కూలిపోయింది. పరీక్షల సమయంలో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ ఏపీ శ్రీవాస్తవ మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒక పైలట్ తక్షణమే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.

ప్రమాదంపై ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ట్వీట్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. రాయ్‌పూర్‌లోని విమానాశ్రయంలో రాష్ట్ర హెలికాప్టర్ కూలిపోయిందనే బాధాకరమైన వార్త ఇప్పుడే అందిందని బఘేల్ రాశాడు. ఈ విషాద ప్రమాదంలో మ‌ర‌ణించిన ఫైలట్ల  మృతిపట్ల తీవ్ర  విచారకరం వ్య‌క్తం చేశారు.  ఈ దుఃఖ సమయంలో భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ట్విట్ చేశారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

click me!