
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 2017 ఆగస్టు 15న అంటే స్వాతంత్ర్య దినోత్సవాన తొలిసారి మదర్సా బోర్డు జాతీయ జెండా ఎగరేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ప్రతి మదర్సా జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని ప్రారంభించింది. మదర్సాల్లో తరగతులు ప్రారంభించడానికి ముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పకుండా జాతీయ గీతాన్ని ఆలపించాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఇవాళ్టి నుంచే అంటే మే 12వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.
యూపీ మైనార్టీ శాఖ మంత్రి దానిష్ ఆజాద్ అన్సారీ ఈ ఆదేశాలను పాస్ చేశారు. మార్చి 24న నిర్వహించిన యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డులో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 12వ తేదీ నుంచి ప్రతి మదర్సాల్లో జాతీయ గీతాన్ని ఆలపించాలనే ఆదేశాలు మే 9వ తేదీ జారీ అయ్యాయి. ఈ ఆదేశాల ప్రకారం, మదర్సాలు ఇది వరకు ఆలపించిన మత పరమైన పాటలతోపాటు జాతీయ గీతాన్ని తప్పకుండా పాడాలి.
రంజాన్ మాసం కారణంగా మదర్సాలు మార్చి 30వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు మూసేశారు. మళ్లీ ఇవాళే అంటే మే 12వ తేదీనే మదర్సాలు తెరుచుకున్నాయి. ఈ ఆదేశాలను ఇవాళ్టి నుంచే అమలు చేశారు. ఈ ఆదేశాలు అన్ని గుర్తింపు పొందిన ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ మదర్సాలకు వర్తిస్తుంది.
యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు చైర్‌పర్సన్ ఇఫ్తికార్ అహ్మద్ జావేద్ సారథ్యంలో మార్చి 24వ తేదీన జరిగిన సమావేశంలో జాతీయ గీత ఆలాపనపై నిర్ణయాలు తీసుకన్నారు. అదే విధంగా మదర్సాల్లో టీచర్ల నియామకానికి టెట్ ఆధారిత మదర్సా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించనున్నట్టు బోర్డు తెలిపింది. మదర్సాల్లో బోధించాలంటే ఇందులో తప్పనిసరిగా అర్హులై ఉండాలని పేర్కొంది. అయితే, ఈ ఎన్నిక ప్రక్రియను అంతిమంగా మేనేజ్‌మెంట్ ఖరారు చేస్తుందని, దీనిపై త్వరలోనే ఓ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపనున్నట్టు వివరించింది.
అనేక పాఠశాలల్లో జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటారని ఇఫ్తికార్ అహ్మద్ జావేద్ అన్నారు. తము కూడా మదర్సా విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందించాలని భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు, దేశ చరిత్రను, సంస్కృతినిక మదర్సాల్లో చదివి విద్యార్థులు తెలుసుకోవడానికి ప్రోత్సహిస్తామని వివరించారు. ఇప్పటికే కొన్ని మదర్సాల్లో మతపరమైన చదువులతోపాటు ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి మదర్సాలో జాతీయ గీత ఆలాపన తప్పనిసరిగా అమలు చేస్తామని పేర్కొన్నారు.