కేరళలో వరద భీభత్సం...67కు చేరిన మృతుల సంఖ్య

By sivanagaprasad KodatiFirst Published Aug 16, 2018, 11:49 AM IST
Highlights

కేరళను వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. డ్యామ్ లలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 

కొచ్చి: కేరళను వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. డ్యామ్ లలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికే వరద ధాటికి 67 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో 39 ప్రధాన డ్యామ్ లుండగా 30 డ్యామ్ లలోకి ప్రమాదకర స్థాయిలోకి వరద నీరు వచ్చి చేరుతుంది.

 ముఖ్యంగా వరద ప్రభావం 14 జిల్లాల్లో అధికంగా ఉండటంతో ఆ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ఉడుక్కి జిల్లాలో వందేళ్ల చరిత్ర కలిగిన ముళ్ల పెరియార్ డ్యామ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముళ్లపెరియార్ డ్యామ్ ఎత్తు 142 అడుగులు కాగా నీటి మట్టం 142 అడుగులకు చేరుకోవడంతో ప్రజలు, అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వివాదాస్పదమైన ముళ్లపెరియార్‌ డ్యామ్‌ నిర్వాహణ తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉండటంతో కేరళ అధికారులు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం భారీగా వరద చేరుతుండటం..డ్యామ్‌ సామర్థ్యాన్ని మించి నీటిమట్టం పెరిగితే భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో స్లిప్‌వేస్‌ నుంచి నీటిని దిగువకు వదలుతున్నారు.  ముళ్ల పెరియార్ డ్యామ్ తో పాటు పలు డ్యామ్ ల నుంచి నీటిని అరేబియన్ సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. 

కేరళ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ, రాష్ట్ర పోలీస్ శాఖ, రక్షణ శాఖ అధికారులు, పారామెలటరీ బలగాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతోపాటు డ్యామ్ పరిసర ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాల నుంచి లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. 

కేరళ చరిత్రలోనే తొలిసారిగా కొచ్చి విమానాశ్రయం మూసివేశారు. ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో దేశంలో నాలుగో విమానాశ్రయంగా కొచ్చి విమానాశ్రయాన్ని చెప్తారు. రన్ వే పై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో శనివారం వరకు రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.  

అటు రైల్వే శాఖ అధికారులు సైతం పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మరికొన్ని రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది. పట్టాలపై నీరు వచ్చి చేరడంతో తిరువనంతపురం కన్యాకుమారి మధ్య నడిచే రైళ్లను నిలిపివేశారు. పర్యాటక ప్రాంతమైన మున్నార్ హిల్స్ వంటి పరిసర ప్రాంతాల్లో సందర్శకులను అనుమతించొద్దని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. 

సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా తో ఫోన్లో మాట్లాడారు. కొచ్చికు వచ్చే అంతర్జాతీయ విమాన సర్వీసులను ముంబైకు మళ్లించాలని అలాగే కేరళ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. అటు పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులను రాకుండా నిలిపివేయాలని సూచించారు. 

అటు కేరళ వరదలపై ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. కేరళ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేశంలో పలు ప్రాంతాల్లో మంచి వర్షాభావ ప్రాంతాలు ఉన్నా కొన్ని ప్రాంతాల్లో వరదలు ప్రభావం బాధాకరమన్నారు. వరదల ధాటికి నష్టపోయిన వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామన్నారు.  

కన్నూరు, ఇడుక్కి, వాయనాడ్,కోజికోడ్ వంటి జిల్లాలో గత 24 గంటలుగా 80 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు స్ఫష్టం చేశారు. మరికొన్ని రోజులు ఇలాగే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కేరళ సీఎం విజయన్ రాష్ట్ర గవర్నర్ పి సదాశివంకు వరదలపై వివరణ ఇచ్చారు. 


మలప్పురం ప్రాంతంలో ఒక ఇళ్లు కుప్పకూలి ఎనిమిది మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. అలాగే పతానంమిట్ట ప్రాంతాంలో ఉన్న 35 మందిని ఎయిర్ పోర్స్ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

అలాగే పంబ నది ఉధృతంగా ప్రవహించడంతో శబరిమలలోని ఉపఆలయాలు నీట మునిగాయి. దీంతో భక్తులు రాకపోకలను నిలిపివేశారు. కేరళ చరిత్రలో ఇలాంటి వరదలు ఎప్పుడు సంభవించలేదని..రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. 

click me!