
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు, చెట్లు నేలకూలుతున్నాయి. పలు భవనాలు కూడా కూలిపోతున్నాయి. మాల్ దేవ్తాలో ఉన్న డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం కూడా క్షణాల్లో కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజ్ గర్వాల్ హిమాలయాల దిగువన ఉంది. ఐఐటీ, టెక్నికల్ కోర్సులతో పాటు ఎన్డీఏ, డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలకు ఇందులో విద్యార్థులు సిద్ధం అవుతుంటారు. అయితే ఈ భవనం పై అంతస్తులు కూలి నదిలో కొట్టుకుపోవడం వైరల్ అయిన వీడియోలో కనిపిస్తోంది.
కాగా.. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని ఉత్తరాఖండ్ లోని ఆరు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో డెహ్రాడూన్, పౌరీ, తెహ్రీ, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే రెండు రోజుల కిందటే ఉత్తరాఖండ్ కు ఆగస్టు 13, 14 తేదీల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (204.4 మిల్లీమీటర్లకు పైగా) కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని అని భారత వాతావరణ శాఖ ట్వీట్ చేసింది.
ఉత్తరాఖండ్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ఆకస్మిక వరదలు సంభవించడంతో ఇప్పటి వరకు 52 మంది మరణించగా, 37 మంది గాయపడ్డారు. అలాగే కొండచరియలు విరిగిపడటం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.