
Death penalty provision for mob lynching: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు కొత్త బిల్లులను ప్రవేశపెట్టడాన్ని ఉలేమాలు, మేధావులు, ముస్లిం మతపెద్దలు స్వాగతించారు. వీటిలో ఒకటి మూకదాడులకు మరణశిక్ష కావడం గమనార్హం. మూకదాడులను అంతమొందించేందుకు చట్టం చేయాల్సిన అవసరం ఉందని ఫతేపురి మసీదు షాహీ ఇమామ్ ముఫ్తీ మౌలానా డాక్టర్ ముహమ్మద్ మక్రం అహ్మద్ అన్నారు. "మూకదాడులు ఎందుకు జరుగుతున్నాయన్నదే ప్రధాన సమస్య. ప్రస్తుతం ఉన్న నిబంధనను కచ్చితంగా పాటిస్తే ఏ నేరాన్నైనా నిర్మూలించవచ్చని నేను అనుకుంటున్నాను, అయితే దీనికి పునాదిరాయి అంటే ఎఫ్ఐఆర్ అవసరం. పారదర్శక దర్యాప్తు, పోలీసుల చర్యలు తమకు ముఖ్యమని" తెలిపారు. చట్టం చేయడంతో పాటు దానిని నిజాయితీగా పాటించాలని ఆయన అన్నారు. దీనిని చట్టబద్ధమైన పద్ధతిలో ఉపయోగించాలనీ, రాజకీయంగా వాడుకోకూడదని పేర్కొన్నారు.
ముఫ్తీ మక్రమ్ మాట్లాడుతూ చట్టబద్ధ పాలన ముఖ్యమని అన్నారు. అదిలేకపోతే దాని ఉనికి ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతిని తెస్తుందని అన్నారు. ఇది ఇప్పటివరకు చట్టం బలహీనత, కానీ పోలీసులు-ఇతర దర్యాప్తు సంస్థలు దీనిని సమర్థవంతంగా చేయగలవు. అందుకే చట్టాన్ని నిజాయితీగా పాటించడం అవసరమని తెలిపారు. అజ్మీర్ దుర్గా షరీఫ్ సజ్జాద్ నషీన్, ఆల్ ఇండియా సజ్జాద్ నషీన్ కౌన్సిల్ అధ్యక్షుడు నసీరుద్దీన్ చిష్తీ మాట్లాడుతూ ఇది మంచి, సానుకూల చర్య అనీ, హింసాత్మక చర్యలకు సమాధానం కనుగొన్నామని అన్నారు. లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ప్రతి పౌరుడికీ సమాన హోదా ఉందని హోంమంత్రి అమిత్ షా నిరూపించారన్నారు. ఈ దేశ రాజ్యాంగం సమానత్వానికి హామీ ఇస్తుందనీ, ప్రతి పౌరుడికి న్యాయం జరుగుతుందన్నారు. ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన హామీ అని తెలిపారు. ప్రభుత్వ ఈ చర్యతో అన్ని అపోహలు తొలగిపోయాయనీ, మూకదాడులను మతంతో ముడిపెడుతున్న వారి నోళ్లు మూయించబడతాయని నసీరుద్దీన్ చిష్తీ అన్నారు.
"నేరం ఏదైనా నేరమే, నేరస్తులు ఎవరైనా నేరస్తులే. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే ప్రధాని నరేంద్ర మోడీ నినాదం ప్రాముఖ్యతకు ఈ చర్య నిదర్శనమని" ఆయన అన్నారు. నిస్సందేహంగా, దేశానికి ఈ చట్టం చాలా అవసరమని ముంబయిలోని అంతర్జాతీయ సూఫీ కారవాన్ అధిపతి ముఫ్తీ మంజూర్ జియా చెప్పారు. "ఎందుకంటే దేశంలో చాలా కాలంగా నాటుకున్న విద్వేష బీజాలను ఇప్పుడు తరిమికొట్టాలి. ఈ బిల్లు ముఖ్యమైనది, దానిని ఆమోదించి చట్టం చేయాలి. ఇది ఏ ఒక్క వర్గాన్ని మెప్పించే చట్టం కాకూడదని" ఆయన అన్నారు. ముఫ్తీ జియా ప్రభుత్వ చర్యను ప్రశంసిస్తూ.. ఇటువంటి చట్టం దేశ ప్రతిష్ఠను కూడా మెరుగుపరుస్తుంది, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు (మూకదాడులు) మన దేశానికి చెడ్డ పేరును తెస్తాయని పేర్కొన్నారు. కాగా, ఇండియన్ జస్టిస్ కోడ్ 2023, ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ 2023, ఇండియన్ ఎవిడెన్స్ బిల్లు 2023 ఈ మూడు తాజా బిల్లుల్లో ఉన్నాయి. బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ), ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ బిల్లులు రానున్నాయి.
(ఆవాజ్ ది వాయిస్ సౌజన్యంతో..)