
ఆ బాలుడికి 12 సంవత్సరాలు. తండ్రి తన తల్లిని వదిలేసి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వారి దగ్గరే ఆ బాలుడు ఉంటున్నాడు. తల్లి విడిగా ఉంటోంది. ప్రతీ రోజూ బుద్ధిగా స్కూల్ కు వెళ్లి చదువుకుంటూ, ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఆ సవతి తల్లి ఎందుకు అలా చేసిందో తెలియదు గానీ.. బాలుడిని బడికి వెళ్లొద్దని సూచించింది. దీంతో బాలుడు నాలుగు రోజుల నుంచి బడికి వెళ్లడం మానేశాడు. ఈ విషయం తెలియని తండ్రి బడికి ఎందుకు వెళ్లడం లేదని బాలుడికి ఇనుప రాడ్ తో వాతలు పెట్టాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
అన్గుల్ జిల్లా బలిపాట పంచాయతీ పరిధిలోని హతియానాలి గ్రామంలో సుభాష్ చంద్ర కొన్నేళ్ల కిందట ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అయితే కొంత కాలం తరువాత అతడు ఆమెను వదిలేశాడు. అనంతరం మంజులత ప్రధాన్ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ద్వారా కలిగిన కుమారుడికి ప్రస్తుతం 12 సంవత్సరాలు. ఆ పిల్లాడు ప్రస్తుతం తండ్రి, సవతి తల్లితో కలిసి ఉంటున్నాడు.
ప్రతీ రోజూ స్థానికంగా ఉన్న స్కూల్ కు వెళ్లి వచ్చి చదువుకుంటున్నాడు. అయితే కొన్ని రోజుల కిందట ఆ బాలుడికి సవతి తల్లి మంజులత బడికి వెళ్లొద్దు అని చెప్పింది. దీంతో ఆ పిల్లాడు బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఈ విషయం సుభాష్ కు తెలియదు. మూడు రోజులు కుమారుడు బడికి వెళ్లకున్నా తండ్రి ఏం అనలేదు. కానీ నాలుగో రోజు బుధవారం కూడా బడికి వెళ్లకపోవడంతో అతడికి కోపం వచ్చింది.
బడికి ఎందుకు వెళ్లడం లేదని బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంట్లో ఉన్న ఇనుప రాడ్ ను వేడి చేసి బాలుడి శరీరంపై వాతలు పెట్టాడు. దీంతో బాలుడు తీవ్రంగా రోదించాడు. దీంతో పిల్లాడి నాన్నమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. తండ్రి బారి నుంచి కుమారుడిని కాపాడింది. అనంతరం హాస్పిటల్ కు తీసుకెళ్లింది. ఈ విషయం తెలియడంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాలుడి నాన్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అనంతరం శనివారం జిల్లా చైల్డ్ లైన్ అధికారులు బాలుడి వద్దకు చేరుకున్నారు. బాలుడి చేతికి అయిన గాయాలను పరిశీలించి చలించిపోయారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ముందు హాజరుపరిచారు. జరిగిన ఘటనను మొత్తం వివరించారు. తరువాత బాధితుడిని షెల్టర్ హోమ్ కు తరలించారు. అయితే సుభాష్ చంద్ర, మంజులత ప్రధాన్ దంపతులను చెండిపాడా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.