heatwave: అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రండి.. ఐఎండీ హెచ్చ‌రిక‌లు

Published : Apr 30, 2022, 10:08 AM IST
heatwave: అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రండి.. ఐఎండీ హెచ్చ‌రిక‌లు

సారాంశం

heatwave: రానున్న రోజుల్లో దేశ‌వ్యాప్తంగా ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే అధికంగా న‌మోద‌వుతాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఎండ‌ల తీవ్ర‌త పెరిగిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌ర‌మైనే ఇండ్ల‌ను నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని ఐఎండీ హెచ్చ‌రించింది.   

Meteorological Department: దేశ‌వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. భానుడు భగ‌భ‌గమంటూ నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో గ‌రిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్ప‌ట‌కే ప‌లు ప్రాంతాల్లో 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదుకావ‌డం ప్ర‌స్తుతం ఎండ‌ల తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. అయితే, రానున్న రోజుల్లో ఎండ‌ల తీవ్ర‌త మ‌రింత‌గా పెరుగుతుంద‌నీ, దీని కార‌ణంగా ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే అధికంగా న‌మోద‌వుతాయ‌ని భారత వాతావరణ విభాగం (India Meteorological Department-ఐఎండీ) హెచ్చరించింది. ఉష్ణోగ్ర‌త‌ల పెరుగుద‌ల‌తో పాటు వేడి గాలుల వీచే ప‌రిస్థితులు మ‌రింత‌గా పెరుగుతాయ‌ని తెలిపింది. దేశంలోని ప‌దుల సంఖ్య‌లోని రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఎండ‌ల తీవ్ర‌త రికార్డు స్థాయికి చేరుకుంది. రానున్న వారం రోజుల వ్య‌వ‌ధిలో ఇది మ‌రింత‌గా పెరుగుతుంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా దేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు మ‌రో ఐదు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ పేర్కొంది. 

‘‘రాబోయే మూడు రోజుల్లో వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది.. ఆ తర్వాత దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుంది’’ అని భార‌త వాతావ‌ర‌ణ విభాగం అంచ‌నా వేసింది. ఇప్ప‌టికే దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ఇదే స‌మ‌యంలో విద్యుత్ కోత‌లు ఏర్ప‌డ‌టంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదయ్యింది. శుక్రవారం ఇది దాదాపు 44 డిగ్రీలు దాటింది. రానున్న రోజుల్లో 45 ఢిగ్రీల‌కు పైగా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని ఐఎండీ హెచ్చ‌రించింది. దేశ‌రాజ‌ధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, హ‌ర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు  న‌మోద‌వుతాయ‌ని తెలిపింది. వ‌చ్చే నెల వారం వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. రెండో వారం నుంచి ఎండ‌ల తీవ్ర‌త కాస్త త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది. 

మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్‌లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయ‌ని వాతావర‌ణ విభాగం వెల్ల‌డించింది. రాజస్థాన్ లోని అజ్మీర్ గేట్ ప్రాంతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక, జమ్మూలో రికార్డుస్థాయిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావ‌డం ఎండ‌ల తీవ్ర‌త‌కు అద్దంప‌డుతోంది. ఒడిశాలో మూడు రోజుల నుంచి వరుసగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతున్నాయి. అధిక ఎండల కారణంగా పాఠశాలలకు ఏప్రిల్ 30 వరకూ ఒడిశా ప్రభుత్వం సెలవులు ప్ర‌క‌టించింది.  వెస్ట్ బెంగాల్ లోనూ వేడి గాలుల తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో అంతకు ముందే అక్క‌డ బ‌డుల‌కు సేల‌వుతు ప్ర‌క‌టించారు. 

తెలుగు రాష్ట్రాల్లోనూ... 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండ‌ల తీవ్రత పెరిగింది. తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లాలో అత్య‌ధికంగా 45 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో 40 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. అత్య‌ధిక స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్న‌ప్ప‌టికీ రాబోయే రెండు రోజుల్లో అక్క‌డ‌క్క‌డ తేలిక‌పాటి వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అయితే, ఎండ‌ల తీవ్ర‌త నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు జిల్లాల‌కు ఐఎండీ రెడ్‌, ఆరెంజ్ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. తీవ్ర‌మైన వ‌డ‌గాల్పులు వీస్తాయ‌నీ, ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌ర‌మైతేనే ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని సూచించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు