అత్యాచార కేసులో మాజీ ప్రధాని మనువడు అరెస్ట్... పాత చీర ఎలా పట్టించిందంటే..?

Published : Aug 07, 2025, 05:45 PM IST
Prajwal Revanna

సారాంశం

Prajwal Revanna: పనిమహిళపై అత్యాచారం చేసిన కేసులో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలాడు. ఆ ఘటనలో దాచిన చీరపై లభ్యమైన డీఎన్ఏ ఆధారాలు కేసును మలుపు తిరిగింది. ఇతర ఆధారాలతో పాటు బాధితురాలి వాంగ్మూలం న్యాయస్థానంలో కీలకంగా నిలిచింది.

చీర ఏంటీ? మాజీ ప్రధాని మనువడిని జైలు పాలు చేయడమేంటీ? అనుకుంటున్నారు. అవును చూసేందుకు అది ఓ సాదాసీదా పాత చీరనే కావచ్చు. కానీ, ఆ చీరలో దాగి ఉన్నది వేదన కాదు, న్యాయం కోసం పోరాడిన నిజం. ఓ కామాంధుడి చేతి నలిగిపోయిన ఓ మహిళ ఆవేదన. ఆనాడు ఆ బాధితురాలు అరుపులు ఎవరికీ వినిపించలేదు. కానీ, ఆ చీర మాత్రం తనలో అన్ని దాచుకుంది. ఆనాడు జరిగిన దారుణానికి నిలువెత్తు సాక్షిగా మారింది. దాచిపెట్టిన ఆ చీర సంవత్సరాల తర్వాత బయటపడింది. మాజీ ప్రధాని మనవడిని నేరస్థుడిగా నిలబెట్టింది.

ఆ నిందితుడు ఎవరో కాదు.. కర్నాటక జేడీఎస్ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna). అత్యాచారం కేసులో అతడ్ని దోషిగా తేలుస్తూ జీవిత ఖైదు విధించింది ట్రయల్ కోర్టు. అయితే ఈ కేసులో పోలీసులు ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యాలు సమర్పించి ఆయనకు జీవిత ఖైదు వేయించేలా చేశారు. ఈ కేసులో ఓ చీర కీలక సాక్ష్యంగా మారిందట. ఆ చీరే ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయనను జీవిత ఖైదు చేసేందుకు సాక్ష్యంగా మారింది. అంతేకాకుండా ఆ రాజకీయ కుటుంబ పరువు కూడా తీసేసింది.

ఏం జరిగిందంటే?

కర్ణాటకలోని కేఆర్ నగర్‌కు చెందిన 47 ఏళ్ల మహిళ పై హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, 2024 ఏప్రిల్ 28న హొళెనరసీపుర పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. గన్నిగడ ఫాం హౌస్‌లో తనపై రెండుసార్లు అత్యాచారం జరిగిందని బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. అనంతర కాలంలో మరిన్ని అత్యాచార ఆరోపణలు ప్రజ్వల్‌పై వచ్చాయి. ఇక 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు హసన్‌లో జరిగిన లైంగిక వేధింపుల వీడియోలు వైరల్ కావడంతో ఆయన జర్మనీ నుంచి పారిపోయారు. ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం విచారణలో భాగంగా గత 14 నెలలుగా ప్రజ్వల్‌ రేవణ్ణ విచారణ ఖైదీగా జైలులో ఉంచారు.

కేసులో కీలక మలుపు:

విచారణలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. దాడి సమయంలో బాధితురాలు వేసుకున్న దుస్తుల గురించి ప్రశ్నించగా, దాడి అనంతరం తన వివస్త్రను చేసి, వీడియోలు తీశారనీ, తన చీరను ప్రజ్వల్ రేవణ్ణ బలవంతంగా తీసుకున్నాడని బాధితరాలు వివరించింది. ఎవరూ గుర్తించలేరన్న ఉద్దేశంతో ఆ చీరను తన ఫాంహౌస్‌లోని అటకపై దాచి ఉంచాడు ప్రజ్వల్. అయితే, బాధితురాలి సమాచారం మేరకు పోలీసులు ఫాంహౌస్‌పై తనిఖీ చేసి ఆ చీరను స్వాధీనం చేసుకున్నారు. ఆ చీరను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపగా.. దానిపై వీర్యం ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది. డీఎన్‌ఏ పరీక్షలో ఆ ఆనవాళ్లు ప్రజ్వల్ డీఎన్‌ఏతో సరిపోవడంతో కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇలా ఈ కేసులో చీర కీలక సాక్ష్యంగా మారింది.

తాజాగా బెంగళూరులోని ఎంపీలు/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులో గన్నిగడ ఫాం హౌస్‌ కేసును విచారణకు వచ్చింది. ఈ విచారణలో మాజీ ఎంపీ అశ్లీల వీడియోలు , 47 ఏళ్ల మహిళపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తేలింది. అలాగే.. తన అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు దోషిగా నిర్ధారించబడింది. ఈ విచారణ అనంతరం కోర్టు ఓ ముఖ్యమైన తీర్పునిచ్చింది. మాజీ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధించింది. బాధితురాలికి 7 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. ప్రజ్వల్ రేవణ్ణ ఇలాంటి స్వభావం గల మరో మూడు కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటనలో ప్రజ్వల్‌ రేవణ్ణ చేసిన తప్పు.. చివరికి అతని జీవితాన్ని తలకిందులు చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !