
Haryana Nuh Violence: హర్యానాలోని నుహ్ లో సోమవారం మతపరమైన ఊరేగింపు సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక ఇమామ్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) ఆధ్వర్యంలో మతపరమైన ఊరేగింపు నిర్వహించగా, మరో వర్గానికి చెందిన వారు రాళ్లు రువ్వడంతో ఘర్షణలకు దారితీసింది. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే, ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. హర్యానా హింసకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారనీ, మొత్తం 44 ఎఫ్ఐఆర్ లను నమోదుచేయగా, 70 మంది అరెస్ట్ చేసినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.
ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసు అధికారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ధృవీకరించారు. నూహ్ లో కర్ఫ్యూ విధించిన పోలీసులు జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. నుహ్ లో జరిగిన ఘర్షణల కారణంగా పొరుగున ఉన్న గురుగ్రామ్ లో మత ఘర్షణలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గురుగ్రామ్ డిప్యూటీ కమిషనర్ ఆగస్టు 2వరకు 144 సెక్షన్ విధించారు. ఇప్పటివరకు 44 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామనీ, 70 మందిని అదుపులోకి తీసుకున్నామని ఖట్టర్ తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ''ఇప్పటి వరకు ఇద్దరు పోలీసు అధికారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. జిల్లాలో శాంతి నెలకొనాలని సామాన్య ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఖట్టర్ మీడియాకు తెలిపారు. నుహ్ లోని గోరఖ్ నాథ్ ఆలయంపై ఓ గుంపు దాడి చేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు ఇండియా టుడే తెలిపింది. ఆలయ పూజారిపై దాడి చేసి మోటార్ సైకిల్ ను దగ్ధం చేశారు. పూజారి శరీరంపై గాయాలున్నాయనీ, వారు కూడా రాళ్లదాడికి పాల్పడ్డారని నివేదికలో పేర్కొన్నారు.
నుహ్ లో మొదలైన మతపరమైన ఉద్రిక్తతలు గురుగ్రామ్ కు చేరుకున్నాయి. నుహ్ లో ముగ్గురు, గురుగ్రామ్ లో ఇమామ్ మరణించారు. గురుగ్రామ్ లోని సెక్టార్-56లో నిర్మాణంలో ఉన్న మసీదు వెలుపల సోమవారం రాత్రి ఇమామ్ సహా ఇద్దరిపై దాడి జరిగినట్లు ఇండియా టుడే తెలిపింది. నుహ్ లో పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతోందని పీటీఐ నివేదికలుపేర్కొంటున్నాయి. ఈ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిందని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ అన్నారు. నుహ్ లో ఘర్షణలు అకస్మాత్తుగా జరిగినట్లు కనిపించడం లేదని ఆయన అన్నారు. వివిధ చోట్ల జరిగిన హింసాకాండ, రాళ్లను సేకరించిన తీరు, ఆయుధాలను ప్రయోగించిన తీరు, కాల్పులు జరిపిన తీరు చూస్తే అకస్మాత్తుగా జరిగినట్లు కనిపించడం లేదని విజ్ అన్నారు. నూహ్ లో రెండు వర్గాలు శాంతియుతంగా జీవిస్తున్నాయని, అయితే రాష్ట్రంలో శాంతికి భంగం కలిగించాలనుకునే వారు ఈ ఘటనకు కుట్ర పన్నారని రాష్ట్ర హోంమంత్రి అన్నారు. అయితే, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, శాంతిని కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వెంటనే ఏ నిర్ణయానికి రాదలుచుకోలేదని ఆయన చెప్పారు.
నుహ్ లో హింస చెలరేగిన తర్వాత పొరుగున ఉన్న పాల్వాల్, ఫరీదాబాద్, గుర్గావ్, ఝజ్జర్, రేవారీ జిల్లాల నుంచి బలగాలను పంపినట్లు విజ్ తెలిపారు. ప్రస్తుతం హరియాణాలోని ఇతర ప్రాంతాల నుంచి బలగాలను పంపిస్తున్నామని తెలిపారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో మాట్లాడానని, రాష్ట్రానికి 20 కంపెనీల కేంద్ర బలగాలను కేటాయించినట్లు విజ్ తెలిపారు. ఏదైనా సుదూర ప్రాంతం నుంచి బలగాలను రప్పించాల్సిన అవసరం వస్తే భారత వైమానిక దళాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించింది. ఇప్పటికే కొన్ని కంపెనీల కేంద్ర బలగాలు నుహ్ కు చేరుకున్నాయని తెలిపారు. ఇద్దరు హోంగార్డులు మృతి చెందారనీ, పలువురు పోలీసులు గాయపడ్డారని హోంమంత్రి తెలిపారు. నల్హర్ లోని మెడికల్ కాలేజీకి 15 మందిని తీసుకురాగా ఒకరు మృతి చెందారు. కాల్పుల్లో గాయపడిన ముగ్గురు పోలీసు సిబ్బంది వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.