
హైదరాబాద్: అన్నా భావూ సాఠే గొప్పదనాన్ని రష్యా గుర్తించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కానీ,ఇండియా మాత్రం పట్టించుకోలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాఠేకు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రధానికి తెలంగాణ ప్రభుత్వం తరపున లేఖ రాస్తానన్నారు. మహారాష్ట్ర సీఎం కూడ ఈ విషయమై ప్రధానికి లేఖ రాయాలని ఆయన కోరారు.
అన్నాభావూ సాఠే 103వ జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మంగళవారంనాడు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు కేసీఆర్.మహారాష్ట్రలోని వాటేగాంలో అన్నాభావూ సాఠే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
అన్నాబావు సాఠే అణగారిన వర్గాల కోసం పాటు పడ్డారని సీఎం కొనియాడారు. అన్నాభావూను పిలిపించి రష్యా ప్రభుత్వం సన్మానించిందని ఆయన గుర్తు చేశారు. సాఠేను ఇండియా మాక్సిం గోర్కిగా రష్యా ప్రభుత్వం పేర్కొన్న ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.రష్యాలోని గ్రంథాలయాల్లో సాఠే విగ్రహాలు ప్రతిష్టించినట్టుగా కేసీఆర్ చెప్పారు.
సమస్యలను చూసి అన్నాబావు సాఠే ఏనాడూ వెనక్కి తగ్గలేదన్నారు. సాఠే రచనలను అన్ని భాషల్లోకి ట్రాన్స్ లేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రష్యాలోని గోర్కి రచనలు అన్ని భాషల్లో అనువదించిన విషయాన్ని ఆయన చెప్పారు. అదే తరహాలో సాఠే రచనలు కూడ అన్ని భాషల్లో అనువదించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
అణగారిన వర్గాల కోసం సాఠే గొంతెత్తారన్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. వంచిత, పీడిత ప్రజల పక్షాన సాఠే నిలిచారన్నారు. అన్నాభావ్ సాఠేను లోక్ షాహెర్ బిరుదుతో సత్కరించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.