కేరళలో పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో హమాస్ నేత వర్చువల్ ప్రసంగం.. కేరళ బీజేపీ ఫైర్

By Mahesh K  |  First Published Oct 28, 2023, 9:12 PM IST

కేరళలో పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ నేత వర్చువల్‌గా ప్రసంగించినట్టు కేరళ బీజేపీ యూనిట్ ఆరోపించింది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
 


తిరువనంతపురం: కేరళలో పాలస్తీనాకు సంఘీభావంగా తీసిన ర్యాలీ వివాదాస్పదమైంది. ఆ ర్యాలీలో వర్చువల్‌గా హమాస్ సాయుధ గ్రూపునకు చెందిన నేత ఒకరు ప్రసంగించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ర్యాలీని కేరళలోని మలప్పురంలో శుక్రవారం సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్ నిర్వహించింది. జమాత్ ఎ ఇస్లామీ యువజన విభాగం ఈ సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్.

ఆ ర్యాలీలో వర్చువల్‌గా హమాస్ నేత ఖాలెద్ మశాల్ ప్రసంగించినట్టు సమాచారం. ఆ ర్యాలీలో హమాస్ ఉగ్రవాద నేత మశాల్ ప్రసంగించడాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఏం చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 

Latest Videos

సురేంద్రన్ ఎక్స్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. హమాస్ నేత ఖాలెద్ మశాల్ వర్చువల్‌గా మలప్పురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించడం కలవరం రేపుతున్నదని తెలిపారు. పినరయి విజయన్ పోలీసులు ఎక్కడ ఉన్నారు? అంటూ ప్రశ్నించారు. సేవ్ పాలస్తీనా అనే నినాదం కింద వారు హమాస్‌ను గొప్ప సంస్థగా, దాని సభ్యులైన తీవ్రవాదులను యోధులుగా కీర్తించే పని చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు.

Also Read: ఔను.. దర్శన్ హీరానందానికి లాగిన్ ఐడీ ఇచ్చాను! కానీ, లంచం కోసం కాదు: మహువా మోయిత్రా

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నిర్వహించిన ర్యాలీలో సీడబ్ల్యూసీ సభ్యుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పాల్గొనడాన్నీ బీజేపీ కేరళ యూనిట్ వ్యతిరేకించింది. పాలస్తీనాకు సంఘీభావం తెలుపడాన్ని హమాస్ మద్దతు కార్యక్రమంగా అది వర్ణించింది.

click me!