గులాం నబీ ఆజాద్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడంపై మండిపడ్డారు. గతనెలలోనూ ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని విమర్శించారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగిసినప్పుడు రాజ్యసభలో చివరి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఆజాద్‌ను ఆకాశానికెత్తారు. కంటతడి కూడా పెట్టుకున్నారు. అదే తరుణంలో ఆజాద్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసే అవకాశముందన్న చర్చ జరిగింది. కానీ, తాజాగా కేంద్రంపై ఆయన చేస్తున్న విమర్శలు ఈ వాదనలను నీరుగారుస్తున్నాయి.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. జమ్ము కశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగించడంపై మండిపడ్డారు. కుల్గాం జిల్లాలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాధారణంగా కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా ఉన్నతీకరిస్తారని చెప్పారు. కానీ, తమ విషయంలో ఇది తలకిందులైందని అన్నారు. తమ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేశారని అన్నారు. ఇది ఎలా ఉందంటే.. డీజీపీని ఒక కానిస్టేబుల్‌గా డిమోట్ చేసినట్టుగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి ఒక సాధారణ ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఒక గ్రామ పంచాయితీ స్థాయికి తగ్గించినట్టుగానే జమ్ము కశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగించడం ఉన్నదని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
గత నెలలోనూ ఆయన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అప్పుడు అధికరణం 370ను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్‌లో అద్భుతమైన మార్పులు వస్తాయని చెప్పారని అన్నారు. అభివృద్ధి పరుగు పెడుతుందని, ఆస్పత్రులు, నిరుద్యోగా సమస్యను పారదోలుతారని ప్రగల్బాలు పలికారని విమర్శించారు. కానీ, అవేమీ జరగలేదని అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే.. గతంలో వివిధ ముఖ్యమంత్రులు పరిపాలించినప్పుడే ఇప్పటి కంటే మెరుగైన పరిస్థితులు జమ్ము కశ్మీర్‌లో ఉండేవని చెప్పారు.
undefined
Also Read: ఆజాద్ ను కాంగ్రెస్ నామినేట్ చేయకుంటే.. మేం చేస్తాం : అథవాలే సంచలనం...
సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో సమూల సంస్కరణలు రావాలని, ప్రక్షాళన గావించాలని డిమాండ్ చేస్తున్న జీ23 నేతల్లో ఒకరు. పార్టీలో మార్పులు రావాలని డిమాండ్ చేసినప్పటికీ సోనియా గాంధీ నాయకత్వంపై సానుకూలంగానే మాట్లాడుతున్నారు. అయితే, అన్ని వర్గాల్లోనూ సదభిప్రాయాలు కలిగిన గులాం నబీ ఆజాద్ జమ్ము కశ్మీర్‌లో కీలకమైన నేత. ఆయనను కొంత కాలంగా బీజేపీ దగ్గరి తీస్తున్నట్టు తెలుస్తున్నది.
Also Read: గులాం నబీ ఆజాద్‌కి వీడ్కోలు: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ
గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం ముగిసినప్పుడు ఈ విషయంపై చర్చ జరిగింది. ఆయన పదవీ కాలం ముగిసినప్పుడు పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. గులాం నబీ ఆజాద్‌పై ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ సీఎంగా ఉన్నప్పుడు అంటే.. గుజరాత్ సీఎంగా మోడీ, జమ్ము కశ్మీర్ సీఎంగా గులాం నబీ ఆజాద్ ఉన్నప్పుడు జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకుని ఆజాద్‌పై తన ఆత్మీయతను చాటుకునే ప్రయత్నం చేశారు ప్రధాని మోడీ. ఈ ఎపిసోడ్ తర్వాత గులాం నబీ ఆజాద్ కేంద్ర ప్రభుత్వ తీరుపై కొంత మెత్తగా మాట్లాడిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో బీజేపీ, గులాం నబీ ఆజాద్ మధ్య సఖ్యత పెరిగినట్టు చర్చలు జరిగాయి. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఆజాద్‌పై చాలా వరకు మౌనం వహిస్తూ వచ్చింది.
Also Read: కాంగ్రెస్‌లో అన్ని పదవులకు ఎన్నికలు నిర్వహించాలి: ఆజాద్ డిమాండ్
అప్పుడే గులాం నబీ ఆజాద్‌ను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి బీజేపీ వ్యూహం రచిస్తున్నదనే చర్చలూ జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గులాం నబీ ఆజాద్‌కు మధ్య సత్సంబంధాలు ఉండటంతో ఈ అంశంపై బలమైన వాదనలు జరిగాయి. వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాలు ఎన్నికలు ముగిశాక మార్చిలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండనుంది. అప్పుడు గులాం నబీ ఆజాద్‌నే ఉపరాష్ట్రపతిగా బీజేపీ ఎన్నుకుంటుందనే చర్చ సాగింది. జీ23 గ్యాంగ్‌లో ఆజాద్ ఉండటం.. ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగిసిన తర్వాత కాంగ్రెస్ కూడా ఆజాద్‌పై మిన్నకుండటం, మరోసారి ఆయనకు కీలక పదవి లేదా.. రాజ్యసభకు పంపకపోవడం వంటి పరిణామాలూ ఈ వాదనలను బలపరుస్తూ వచ్చాయి. కానీ, తాజాగా, ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. కొంత కాలంగా జమ్ము కశ్మీర్ విషయమై నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. దీంతో ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయనే చర్చ జరుగుతున్నది.