గుజరాత్‌లో వేగంగా మారుతున్న పరిణామాలు.. అసెంబ్లీ స్పీకర్ రాజీనామా, మంత్రిగా ప్రమాణం

By Siva KodatiFirst Published Sep 16, 2021, 8:02 PM IST
Highlights

గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి పంపించారు. ఆ తర్వాత పరిణామాలు కూడా వేగంగా జరిగిపోయాయి. స్పీకర్ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చినట్టు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. మంత్రివర్గంలోకి వెళ్లడం వల్లే రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు.
 

గుజరాత్ రాజకీయాల్లో గల కొన్ని రోజులుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు 15 నెలల ముందు సీఎం విజయ్ రూపానీ అనూహ్యంగా రాజీనామా చేశారు. అనంతరం ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. ఈ తరుణంలో ఈరోజు మరో ఆసక్తికర పరిణామం సంభవించింది. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి పంపించారు. ఆ తర్వాత పరిణామాలు కూడా వేగంగా జరిగిపోయాయి. స్పీకర్ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చినట్టు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. అయితే మంత్రివర్గంలోకి వెళ్లడం వల్లే రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు.

అంతకుముందు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంత్రివర్గంలోని మంత్రులకు ఈసారి చోటు దక్కలేదు. శాసనసభ మాజీ స్పీకర్ రాజేంద్ర త్రివేది, గుజరాత్ బీజేపీ మాజీ అధ్యక్షుడు జీతూ వఘానీలు నూతన మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో 24 మందికి చోటు కల్పించారు. వీరిలో 10 మంది కేబినెట్ మంత్రులు, 14 మంది సహాయ మంత్రులు, సహాయ మంత్రుల్లో ఐదుగురు స్వతంత్ర హోదాగల మంత్రులు, వీరి చేత గవర్నర్ ఆచార్య దేవవ్రత్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విజయ్ రూపానీ కూడా పాల్గొన్నారు. 

click me!