Third Wave: అక్టోబర్, నవంబర్ నెలల్లో వైరస్ ముప్పు ఎక్కువ.. అప్రమత్త అత్యవసరం: కేంద్రం

By telugu teamFirst Published Sep 16, 2021, 7:14 PM IST
Highlights

వచ్చే రెండు మూడు నెలల్లో పండుగలుండటంతోపాటు ఫ్లూ వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశముండటం వలన ప్రజలు అత్యంత జాగ్రత్తగా మసులుకోవాలని కేంద్రం హెచ్చరించింది. కరోనాపై పోరులో అక్టోబర్, నవంబర్ నెలలు కీలకమని తెలిపింది. పండుగలు నిరాడంబరంగా జరుపుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేసింది.
 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితిని వెల్లడిస్తూ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో కరోనా కేసులు కొద్దిమొత్తంలో తగ్గాయని, అయినప్పటికీ అవి దేశంలోని మొత్తం కేసుల్లో 68శాతంగా ఉన్నాయని తెలిపింది. కేరళలో 1.99 లక్షల కరోనా యాక్టివ్ కేసులున్నాయని, మరో ఐదు రాష్ట్రాల(మిజోరం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర)లో యాక్టివ్ కేసులు పదివేలకు పైగా ఉన్నాయని వివరించింది. కరోనావైరస్ థర్డ్ వేవ్ ఆందోళనల నేపథ్యంలో పండుగల నెలలు అక్టోబర్, నవంబర్‌లు అత్యంత కీలకమని తెలిపింది.

‘కేరళలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇతర రాష్ట్రాలు కరోనా కేసులకు అడ్డుకట్ట వేస్తున్నాయి. కానీ, పండుగలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజలు ఎక్కువ మొత్తంలో బయటికి వచ్చి సామూహికంగా వేడుకలు చేసుకునే అవకాశం ఉంది. తద్వార వైరస్ వ్యాప్తికి తగిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది’ అని హెచ్చరించారు.

నేషనల్ కొవిడ్ టాస్క్ ఫోర్స్ డాక్టర్ వీకే పాల్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండు మూడు నెలలు కరోనాపై పోరులో అత్యంత కీలకమని వివరించారు. దేశంలో ఎక్కడా కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలల్లో పండుగులతోపాటు ఫ్లూ వ్యాధులు వ్యాపించే కాలమని, కాబట్టి, అందరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పండుగలను వైభవంగా జరుపుకోకుండా సాధారణంగానే ఇంటిలోనే జరుపుకోవాలని అన్నారు. మిజోరంలో కేసులు పెరుగుతున్నాయని, అయితే, రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా వ్యాప్తిని కట్టడి చేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. దేశంలో 20శాతం మంది వయోజనులకు రెండు డోసలు వ్యాక్సిన్, 62 శాతం మందికి సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించారు.

దేశవ్యాప్తంగా 30,570 కరోనా కేసులు నమోదైనట్టు గురువారం కేంద్రం వెల్లడించింది. కాగా, యాక్టివ్ కేసులు 3.42 లక్షలున్నట్టు వివరించింది.

click me!