NCC: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీలో ఎంఎస్ ధోని

By telugu teamFirst Published Sep 16, 2021, 6:21 PM IST
Highlights

నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌ను మారిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దడం, అంతర్జాతీయస్థాయికి తేవడానికి ప్రతిపాదనలు చేయడానికి కేంద్ర రక్షణ శాఖ 15 మంది సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో క్రికెటర్ ఎంఎస్ ధోని, బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రలను కమిటీలో చేర్చింది.
 

న్యూఢిల్లీ: నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి కేంద్ర రక్షణ శాఖ 15 మంది సభ్యులతో ఓ నిపుణుల కమిటీ వేసింది. ఇందులో టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి చోటుదక్కింది. ఎంఎస్ ధోనితోపాటు బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రకూడా ఈ కమిటీలో ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బైజయంత్ పాండా ఈ కమిటీకి సారథ్యం వహించనున్నారు.

ఎన్‌సీసీ తీరుతెన్నులు, కరికులాన్ని మొత్తం సమగ్రంగా ఈ కమిటీ సమీక్షించనుంది. ఎన్‌సీసీ క్యాడెట్లను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రతిపాదనలు, సూచనలను చేయనుంది. జాతి నిర్మాణానికి, అభివృద్ధిలో అన్ని రంగాల్లో పాలుపంచుకోవడానికి అనుకూలంగా తీర్చిదిద్దడానికి సూచనలు చేస్తుంది. అంతర్జాతీయ యువజన సంఘాల తీరును పరిశీలించి ఎన్‌సీసీకి అవసరమైన సలహాలు ఇవ్వనుంది. ఎన్‌సీసీ అల్యూమ్నీ సహాకారాన్ని తీసుకుని సంస్థను ఉన్నతీకరించడానికి పనిచేయనుంది.

ఈ కమిటీలో ఇద్దరు ఎంపీలు కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్(రిటైర్డ్), వినయ్ సహస్రబుద్దెలతోపాటు మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, క్రికెటర్ ఎంఎస్ ధోని, జామియా మిలియా వీసీ నజ్మా అక్తర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యాల్‌లను కమిటీ సభ్యులుగా కేంద్రం నియమించింది. 

వీరితోపాటు ఎన్‌డీటీ విమెన్స్ యనివర్సిటీ మాజీ వీసీ వసుధ కామత్, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ భారతీయ శిక్షక్ మండల్ ముకుల్ కనిత్కర్, మేజర్ జనరల్ అలోక్ రాజ్(రిటైర్డ్), డీఐసీసీఐ చైర్మన్ మిలింద్ కాంబ్లే, ఎస్ఐఎస్ ఇండియా లిమిటెడ్ ఎండీ రితురాజ్ సిన్హా, వాటర్ ఆర్గనైజేషన్ సీవోవో వేదికా బండార్కర్, డేటా బుక్ సీఈవో ఆనంద్ షా‌లనూ సభ్యులుగా నియమించింది. డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ సంయుక్త కార్యదర్శి (శిక్షణ) మయాంక్ తెవారీని సెక్రెటరీ మెంబర్‌గా కేంద్రం ఎంపిక చేసింది.

click me!