
న్యూఢిల్లీ: మోడీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీ అప్పీల్‌ను విచారణ నుంచి న్యాయమూర్తి గీతా గోపీ తప్పుకున్నారు. ఈ కేసును మరో ధర్మాసనానికి కేటాయించాలని చీఫ్ జస్టిస్‌ను కోరుతూ ఆమె రిజిస్ట్రీకి సూచనలు చేశారు. రాహుల్ గాంధీ పిటిషన్ విచారించడానికి కొత్త న్యాయమూర్తి కోసం రెండు రోజుల సమయం పట్టవచ్చునని ఆయన లాయర్ పీఎస్ చాపనేరీ ఎన్డీటీవీకి తెలిపారు.
అందరి దొంగల ఇంటి పేరు మోడీ అనే ఎందుకు ఉన్నదంటూ రాహుల్ గాంధీ కర్ణాటకలో 2019లో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్‌లోని బీజేపీ ఎమ్మెల్యే సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారించి రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. ఆ తర్వాత రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష ఫలితంగా రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు.
సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన పైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆ కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించలేదు. దీంతో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. సూరత్ కోర్టు తనను దోషిగా తేల్చుతూ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరారు. తనను దోషిగా తేల్చడంలో సూరత్ కోర్టు కొన్ని పొరపాట్లు చేసిందని వాదించారు.
Also Read: రాహుల్ గాంధీ తర్వాత.. తేజస్వీ యాదవ్‌పై గుజరాత్ కోర్టులో పరువునష్టం దావా.. ఆ వ్యాఖ్యలేవంటే?
రాహుల్ గాంధీ ఆశించినట్టుగా గుజరాత్ హైకోర్టు తీర్పు ఇస్తే.. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని కాపాడుకుంటారు. లేదంటే, ఈ వేటు ఇలాగే కొనసాగడమే కాదు.. మరో 8 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను రాహుల్ గాంధీ కోల్పోతారు.