గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2022: రెండో విడతలో 59 శాతం పోలింగ్ నమోదు

By narsimha lodeFirst Published Dec 5, 2022, 6:19 PM IST
Highlights

గుజరాత్ లో రెండో విడత పోలింగ్ ముగిసింది.  ఇవాళ  59 శాతం  పోలింగ్ నమోదైంది.  పోలింగ్  బూతుల్లో  పోలింగ్ సమయం ముగిసేనాటికి పోలింగ్  బూతుల్లో  ఉన్నవారికి ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం  ఇచ్చారు. 

గాంధీనగర్: గుజరాత్  అసెంబ్లీ స్థానానికి  రెండో దశ  పోలింగ్  సోమవారంనాడు ముగిసింది.  గుజరాత్  లో 182 అసెంబ్లీ స్థానాలకు  తొలి, మలి విడతలుగా  పోలింగ్  నిర్వహించారు.  మొదటి విడతలో డిసెంబర్ 1న 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ దశలో సౌరాష్ట్ర, కచ్, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీలతో సహా మొత్తం 39 రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలిపాయి. 89 అసెంబ్లీ స్థానాల బరిలో మొత్తం 788 మంది అభ్యర్థులు నిలిచారు. మొదటి దశలో మొత్తం ఓటింగ్ శాతం 63.14గా నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.

రెండో విడతలో అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్‌తో సహా మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లోని 93 స్థానాల్లో పోలింగ్ జరిగింది. రెండో దశలోని మొత్తం 93 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలిపింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా మొత్తం 93 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ 90 స్థానాల్లో పోటీ చేయగా.. దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.  

గుజరాత్‌లో  వరుసగా ఏడోసారి అధికారంలోకి రావాలని  బీజేపీ చూస్తోంది. అయితే కాంగ్రెస్‌, ఆప్‌లు కూడా బీజేపీకి గట్టి పోటీనిస్తున్నాయి. మోడీ బీజేపీ తరపున భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర నుంచి విరామం తీసుకుని గుజరాత్ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం నిర్వహించారు. ఆప్ అభ్యర్థుల తరపున కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

click me!