గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 1,621 మంది అభ్యర్థులు.. వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Nov 22, 2022, 4:12 PM IST
Highlights

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ డిసెంబర్ 1న జరగనుండగా.. రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5న జరగనుంది. డిసెంబర్ 8న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ డిసెంబర్ 1న జరగనుండగా.. రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5న జరగనుంది. డిసెంబర్ 8న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 17న ముగియగా, రెండో దశ నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం (నవంబర్ 21) రోజున ముగిసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో.. 1,621 మంది అభ్యర్థులు బరిలో మిగిలారని మంగళవారం ఒక అధికారి తెలిపారని పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. 

తొలి దశ ఎన్నికల్లో పోలింగ్‌ జరగనున్న 89 అసెంబ్లీ స్థానాలకు గానూ 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో దశలో ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ 93 స్థానాలకు గాను 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
 
గుజరాత్ అసెంబ్లీ  ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ మొత్తం 182 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. కాంగ్రెస్ 179 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా.. ప్రీ పోల్ అలియన్స్‌లో భాగంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి మూడు సీట్లను కేటాయించింది. అయితే దేవ్‌గఢ్ బరియా స్థానానికి ఎన్సీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆ పార్టీ రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మొత్తం 182 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. అయితే సూరత్ ఈస్ట్ స్థానం నుంచి బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి.. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆప్ పోటీ చేసే స్థానాల సంఖ్య 181గా ఉంది. ఇక, ఆల్ ఇండియన్ మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) 14 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. అయితే ఆ పార్టీ అభ్యర్థి బాపునగర్ స్థానం నుంచివైదొలిగారు.

సౌరాష్ట్ర-కచ్ ప్రాంతం, దక్షిణ గుజరాత్‌లోని జిల్లాల్లోని నియోజకవర్గాలకు మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ జాబితాలో.. వల్సాద్, తాపి, డాంగ్, నవ్‌సారి, సూరత్, బరూచ్, నర్మదా, బోటాడ్, భావ్‌నగర్, అమ్రేలి, గిర్ సోమనాథ్, జునాగఢ్, పోర్‌బందర్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, రాజ్‌కోట్, మోర్బి, సురేంద్రనగర్, కచ్ జిల్లాలు ఉన్నాయి. రెండో దశలో మధ్య, ఉత్తర గుజరాత్‌లోని బనస్కాంత, పటాన్, మెహసానా, సబర్‌కాంత, ఆరావళి, గాంధీనగర్, అహ్మదాబాద్, ఆనంద్, ఖేడా, మహిసాగర్, పంచమహల్, దాహోద్, వడోదర, ఛోటా ఉదయ్‌పూర్ జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

click me!