అస్సాం-మేఘాలయ సరిహద్దులో ఘర్షణ.. ఫారెస్ట్ గార్డుతో సహా నలుగురు మృతి.. అసలేం జరిగిందంటే..

By Sumanth KanukulaFirst Published Nov 22, 2022, 3:27 PM IST
Highlights

అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో అస్సాం-మేఘాలయ సరిహద్దులో హింస చెలరేగింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘర్షణలో.. నలుగురు మృతిచెందారు. 

అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో అస్సాం-మేఘాలయ సరిహద్దులో హింస చెలరేగింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘర్షణలో.. నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ ఫారెస్ట్ గార్డు కూడా ఉన్నారు. అస్సోంలోని పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ముక్రు ప్రాంతంలో తెల్లవారుజామును 3 గంటల ప్రాంతంలో మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా వైపు  అక్రమ  కలప తరలిస్తున్న ట్రక్కును అస్సాం అటవీ శాఖ బృందం అడ్డుకుంది. అయితే ట్రక్కులోని వారు పారిపోయేందుకు యత్నించారని అస్సాం పోలీసులు తెలిపారు. అయితే  ఈ క్రమంలోనే ఫారెస్ట్ గార్డులు ట్రక్కుపై కాల్పులు జరిపి టైర్ గాలిని తీసేశారని చెప్పారు. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని పారెస్ట్ సిబ్బంది  పట్టుకున్నారని.. మిగిలినవారు పారిపోయారని తెలిపారు. 

ఈ ఘటన తర్వాత ఫారెస్ట్ సిబ్బంది జిరికెండింగ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారని తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను పెంచారని చెప్పారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత.. మేఘాలయ నుంచి ఆయుధాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉదయం 5 గంటలకు అక్కడకు వచ్చారని చెప్పారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఫారెస్ట్ గార్డులు, పోలీసు సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు  జరపాల్సి వచ్చిందని చెప్పారు. 

ఈ ఘటనలో ఫారెస్ట్ హోంగార్డు బిద్యాసింగ్ లెఖ్తేతో పాటు.. మేఘాలయలోని ఖాసీ వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారని అస్సాం పోలీసులు  తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ఈ ఘటన తర్వాత మేఘాలయ సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లో అస్సాం పోలీసులు భద్రతను పెంచారు. ఇక, మరణించిన నలుగురు బుల్లెట్ గాయాలతో మరణించారా లేదా మరేదైనా ఆయుధం తగలడంతో మృతిచెందారా అనేది స్పష్టంగా తెలియలేదు.

ఇక, అస్సాం, మేఘాలయల మధ్య 884.9 కి.మీ పొడవైన అంతర్ రాష్ట్ర సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు వెంబడి 12 ప్రాంతాలలో చాలా కాలంగా వివాదం ఉంది. ఇందులో ఆరింటిలో వివాదానికి ముగింపు పలికేందుకు మార్చిలో న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఇరు రాష్ట్రాలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.  మిగిలిన ఆరు ప్రాంతాల్లోని వివాదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు చర్చలు కూడా ప్రారంభించాయి.

click me!